ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలైనా, దేశమైనా అప్పులు చేయాల్సిందే. నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి తోడు సంక్షేమం.. వెరసి, అప్పులు చేయక తప్పని పరిస్థితి. నిజానికి, అప్పులన్నీ సంక్షేమం కోసమే జరుగుతున్నాయనడం అతిశయోక్తి కాదు.! ఎందుకంటే, సంక్షేమ పథకాలు ఆ స్థాయిలో ప్రభుత్వ ఖజానాకి భారంగా మారుతున్నాయ్.
ఒక ప్రభుత్వానికి మించి ఇంకో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిందే. సంక్షేమం ప్రజల హక్కు. అయితే, అభివృద్ధి ఫలాల నుంచి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాల్సి వుంటుంది. కానీ, అందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించడంలేదు. కేవలం సంక్షేమ పథకాలే గెలిపిస్తాయా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
వైసీపీ హయాంలో అప్పులు జరిగాయి, టీడీపీ హయాంలోనూ అప్పులు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన అప్పులకీ, టీడీపీ హయాంలో జరుగుతున్న అప్పులకీ స్పష్టమైన తేడా వుంది. ఇక్కడ టీడీపీ హయాం అంటే, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలో.. అని అర్థం.
వైఎస్ జగన్ హయాంలో అయితే, కేవలం బటన్లు నొక్కడానికే అప్పులు చేసే పరిస్థితి వుండేది. అప్పు దొరక్కపోతే, బటన్లు నొక్కడం ఆలస్యమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు సజావుగా అమలవుతున్నాయి. ఎక్కడా పబ్లిసిటీ స్టంట్లు లేవు.
కాకపోతే, కూటమి హయాంలో సంక్షేమంతోపాటు అభివృద్ధి పనులూ నడుస్తున్నాయి. ఉదాహరణకి వైసీపీ హయాంలో రోడ్ల కోసం వెచ్చించాల్సిన నిధులు, సంక్షేమ పథకాలకు డైవర్ట్ చేయడమే కాకుండా, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతుంటే, రోడ్ల మీద జనం తిరగాల్సిన అవసరమేముంది.? అని వైసీపీ నేతలు ప్రశ్నించేవారు. అభివృద్ధి పట్ల వైసీపీ ప్రదర్శించిన మూర్ఖత్వం అలాంటిది.
ఇప్పుడేమో, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. మారుమూల గ్రామాల్లోకీ రోడ్లు వెళుతున్నాయ్. స్వాతంత్ర్యం వచ్చాక రోడ్లంటే ఏంటో తెలియని గిరిజన గ్రామాల్లోనూ రోడ్లు పడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇదీ అభివృద్ధి అంటే.
ఇక, వైసీపీ హయాంలో మూడు రాజధానులంటూ, అసలు సిసలు రాజధాని అమరావతిని పాతాళానికి తొక్కేసిన సంగతి తెలిసిందే. ఆ అమరావతి పనులు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులూ శరవేగంగా జరుగుతున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయ్.. పెట్టుబడులూ వస్తున్నాయ్.
గతంలో జరిగిన అప్పులకీ, ఇప్పుడు జరుగుతున్న అప్పులకీ లెక్కలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి కదా. అప్పు చేసిన ప్రతి పైసా, ప్రజోపయోగంగా వుంటోందిప్పుడు. అప్పట్లో అయితే, రాష్ట్రం తరఫున అప్పులు చేయడం, అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్ళడం జరిగేది.
పేదలకు నివాస స్థలం, పక్కా ఇళ్ళు.. అంటూ వైసీపీ చేసిన ప్రచారం విషయానికొస్తే, ఆ పేరుతో వైసీపీ నేతలు తక్కువ ధరలకు భూములు కొని, వాటిని ఎక్కువ ధరలకు ప్రభుత్వానికి అమ్మి.. క్యాష్ చేసుకున్న విషయం విదితమే. వైసీపీ నేతలు బాగు పడటం తప్ప, ప్రజలకు అప్పట్లో ఒరిగిందేమీ లేదు. ఇలా భూములు సమీకరించడానికి సైతం ప్రభుత్వం అప్పట్లో అప్పులు చేయాల్సి వచ్చింది.
ఎలా చూసినా, వైసీపీ హయాంలో దోపిడీ అనేది విచ్చలవిడిగా సాగింది.
నొక్కిన బటన్లకు లెక్క వుందేమోగానీ, అలా నొక్కిన బటన్ల కోసం చేసిన అప్పులకు లెక్క దొరకని పరిస్థితి వుండేది. ఇంతా చేసి, అప్పు మిగిలిపోయిందిగానీ, ప్రజలకు ఒరిగిందేమీ లేదు వైసీపీ హయాంలో.