“ధూం ధాం” మూవీ ఫ్యామిలీతో చూడదగ్గ ఎంటర్ టైనర్ అని మూవీ హీరో చేతన్ కృష్ణ చెప్పుకొచ్చారు. ఆయన హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్ గా చేస్తున్న మూవీ ధూం ధాం. సాయి కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ మీద ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ లకు మంచి టాక్ వచ్చిందని మూవీ టీమ్ చెబుతోంది. ఈ నెల 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో చేతన్ కృష్ణ మూవీ విశేషాలను పంచుకున్నారు.
ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీలో చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది ఈ మూవీతో తీరిపోయింది. ఇప్పటికే నేను నటించిన ఫస్ట్ ర్యాంక్ రాజు, బీచ్ రోడ్ చేతన్, రోజులు మారాయి, గల్ఫ్ మూవీస్ నాకు నటుడిగా గుర్తింపు తెచ్చాయి. మంచి ఓపెనింగ్స్ కూడా ఇందులో కొన్నింటికి వచ్చాయి. సాయికిషోర్ చెప్పిన కథ నాకు ఎంతగానో నచ్చింది. అందుకే వెంటనే మూవీకి ఒప్పుకున్నాను. ఒక తండ్రి కోసం కొడుకు పడే ఆరాటం ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా బాధ్యతతో కూడినట్టు ఉంటుంది.
తన వల్ల ఒక అమ్మాయి లైఫ్ లో వచ్చిన ప్రాబ్లమ్ ను అతనే ఎలా సాల్వ్ చేస్తాడనేది మూవీ స్టోరీ. దాన్ని తెరమీద చూస్తేనే మీకు బాగా క్లియర్ గా అర్థం అవుతుంది. సెకండాఫ్ మొత్తం నవ్వుతూనే ఉంటారు. అంత బాగా వచ్చింది. ఇందులో వెన్నెల కిషోర్, సాయికుమార్ లాంటి వారు కామెడీని బాగా పండించారు. వైజాగ్ లో ప్రీమియర్ వేసినప్పుడు కూడా థియేటర్ లో నవ్వులు విరిసాయి. అందుకే మూవీ హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. పైగా మైత్రీ మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేయడం మాకు కలిసొచ్చే అంశం అంటూ తెలిపారు చేతన్.