ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో విశాఖకు చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా, విశాఖ అభివృద్ధిపై తనకున్న ప్రత్యేకమైన శ్రద్ధని జనసేనాని, వారితో పంచుకున్నారు.
కాలుష్య కారక పరిశ్రమలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. తనకెంతో ఇష్టమైన విశాఖ నుంచి, పలువురు నేతలు జనసేన పార్టీలో చేరడం పట్ల జనసేనాని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి దూకెయ్యగా, కొందరు జనసేనలో చేరారు.
ఉమ్మడి విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఈ ఎన్నిక కోసం ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
కూటమి తరఫున అభ్యర్థిని త్వరలో ప్రకటించబోతున్నారు. ఈలోగా విశాఖలో వైసీపీని ఖాళీ చేసెయ్యాలన్న దిశగా అటు టీడీపీ, ఇటు జనసేన, ఇంకోపక్క బీజేపీ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయ్.
రాజకీయాల సంగతి పక్కన పెడితే, ఉప ముఖ్యమంత్రి హోదాలో విశాఖ సహా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తన పరిధిలో వున్న శాఖలకు సంబంధించిన అధికారులపై, ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు జనసేనాని.
దీంతోపాటుగా, ఉత్తరాంధ్రలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగానూ జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల ముగిసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా సత్తా చాటిందని జనసేన శ్రేణులంటున్నాయి.
ఇటు అభివృద్ధి పరంగా, అటు రాజకీయ కోణంలోనూ ఉత్తరాంధ్రపై జనసేనాని స్పెషల్ ఫోకస్ పెట్టిన దరిమిలా, రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో జనసేన మరింత బలపడబోతోందన్నది నిర్వివాదాంశం.