ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనను జ్వరంతోపాటు స్పాండిలైటిస్ కూడా ఇబ్బంది పెడుతోందని వైద్యులు తెలిపారు. వారి సూచన మేరకు ప్రస్తుతం పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కారణంగా గురువారం జరిగే క్యాబినెట్ సమావేశానికి పవన్ హాజరు కాలేకపోవచ్చని ఆయన కార్యాలయం తెలిపింది. మరి కొద్ది రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ క్యాబినెట్ మీటింగ్ వాస్తవానికి పవన్ కు చాలా స్పెషల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబోయే మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడంతో పవన్ కి కూడా ఈ సమావేశాలు గుర్తిండిపోయేవే. కానీ ఆయనను తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఆ సమావేశాలకు గైర్హాజరయ్యే అవకాశం ఉంది.
మరోవైపు మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఆయన విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. అధికారులతో రివ్యూ మీటింగులు, పర్యటనలు అంటూ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయన ఇప్పటికే కమిట్ అయిన “హరిహర వీరమల్లు”, “ఉస్తాద్ భగత్ సింగ్”, “ఓజీ” సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే వీలు కుదిరినప్పుడల్లా “హరిహర వీరమల్లు” షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు. ఓవైపు మంత్రిగా మరోవైపు సినిమాలతో విశ్రాంతి లేకుండా శ్రమిస్తుండటంతో ఒత్తిడికి లోనై స్పాండిలైటిస్ కి గురై ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.