‘‘అప్పుడూ మీరే అధికారులు.. ఇప్పుడూ మీరే అధికారులు. అప్పుడూ అదే రాజ్యాంగం, ఇప్పుడూ అదే రాజ్యాంగం.! అప్పుడు మీరు సరిగ్గా పనిచేసే వాతావరణం లేదు. మీపై చాలా ఒత్తిడులు వుండేవి. ఇప్పుడు వుండవ్.. మీ మీద ఎలాంటి ఒత్తిడులూ లేకుండా, మీరు స్వేచ్ఛగా పని చేసేలా మంచి వాతావరణం కల్పించే బాధ్యత మాది..’’ అంటూ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అధికారుల్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ప్రజా ప్రతినిధుల నుంచి ఎలాంటి ఒత్తిళ్ళూ వుండవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంపై అధికారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో వున్నా, అధికారులపై రాజకీయ ఒత్తిళ్ళు అధికంగానే వుంటాయ్. కాస్త అధికం.. ఇంకాస్త అధికం.. అంతే తేడా.!
కానీ, మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం హోదాలో, మంచి మార్పు దిశగా తనదైన శైలిలో అధికారులకు స్పష్టమైన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనుభవం.. రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందన్న పవన్ కళ్యాణ్, పాలనకు సంబంధించి తాను నిత్య విద్యార్థిలా వ్యవహరిస్తానని చెప్పడం గమనార్హం.
‘పాలన ఎలా వుండకూడదో గత ఐదేళ్ళ పాలన తెలియజేసింది. పాలన ఎలా వుండాలో ఈ ఐదేళ్ళ పాలన తెలియజేస్తుంది.. పాలకులుగా ప్రజలకు జవాబుదారీతనం వుండాలి..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
గడచిన ఐదేళ్ళలో రోడ్ల మీద గుంతల్ని సైతం బాగు చేయలేదనీ, అధికారంలోకి వస్తూనే, రోడ్లను బాగు చేయడంపై ఫోకస్ పెట్టామనీ, గ్రామ పంచాయితీల్ని బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామని పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు.
ఒకే రోజు రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయితీల్లో ఉపాది హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నామనీ, పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురం నియోజకవర్గంలో మొదటగా ఈ గ్రామ సభల్ని చేపడతామని ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు.
వైసీపీ ఐదేళ్ళ పాలనలో, రాష్ట్రం అభివృద్ధి కోణంలో చూస్తే ఇరవయ్యేళ్ళు వెనక్కి వెళ్ళందని పవన్ కళ్యాణ్ అన్నారు.