డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల సమావేశం సందర్భంగా వచ్చిన డిమాండ్.
ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ సరిగా పాటించకపోవడం వల్ల అక్కడ జనాభా ఎక్కువ వుందనీ, దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ సరిగ్గా పాటించడం వల్ల, జనాభా తగ్గిందనీ డీఎంకే సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇందులో వాస్తవం లేకపోలేదు కూడా.
తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ తరహా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, డీఎంకే నేతృత్వంలో చెన్నయ్‌లో జరిగిన సమావేశానికి తెలంగాణ నుంచి కేసీయార్ హాజరయ్యారుగానీ, ఏపీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా, డీలిమిటేషన్ విషయమై గుస్సా అవుతున్న సంగతి తెలిసిందే.
నియోజకవర్గాల పునర్విభజనే డీలిమిటేషన్. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను పెంచేందుకు ఉద్దేశించిన డీలిమిటేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కావాల్సి వుంది. నిజానికి, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబందించి విభజన చట్టంలోనే పేర్కొన్నారు. అయితే, అది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినది.
అందివచ్చిన అవకాశాన్ని వైఎస్ జగన్ సద్వినియోగం చేసుకుంటారని వైసీపీ క్యాడర్ చాలా బలంగా నమ్మింది డీలిమిటేషన్ విషయంలో. వైఎస్ జగన్ స్వయంగా ఈ ఉద్యమానికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతారని కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు భావించారు.
అయితే, సింపుల్‌గా ఓ లేఖ రాసి, అందులో తన భావాల్ని వెల్లడించేసి ఊరుకున్నారు వైఎస్ జగన్. ‘జగన్ మాతోనే వుంటారని భావిస్తున్నాం’ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సెలవిచ్చారు. అయినా, జగన్ ఎందుకు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు.?
జనసేన, టీడీపీ ఎలాగూ బీజేపీతో కలిసి పొత్తులో వున్నాయి గనుక, బీజేపీకి వ్యతిరేకంగా నడుస్తున్న డీలిమిటేషన్ పోరులో జనసేన కావొచ్చు, బీజేపీ కావొచ్చు.. పాల్గొనే అవకాశం లేదు. వైసీపీ పరిస్థితి అది కాదు కదా.! ఎందుకు కాదు, బీజేపీని ప్రశ్నించాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు. అదీ అసలు సంగతి.
‘అన్నా, నువ్వు ఎందుకు వెళ్ళలేదు.? మంచి అవకాశాన్ని వదులుకున్నావ్.. డీ లిమిటేషన్ ఉద్యమానికి నువ్వే నాయకత్వం వహించు..’ అంటూ వైసీపీ క్యాడర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా ఉచిత సలహాలు ఇస్తూనే వున్నారు.
అన్నట్టు, త్వరలో తెలంగాణలో ఈ డీలిమిటేషన్ వ్యవహారానికి సంబంధించిన సమావేశం జరగబోతోందిట. ఆ తర్వాత ఏపీలోనూ సమావేశం పెట్టే ఆలోచనలో స్టాలిన్ సహా, డీలిమిటేషన్ పోరాటంలో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీల అధినేతలు వున్నారు.
ఇదిలా వుంటే, చెన్నయ్ సమావేశానికి తమకు కూడా ఆహ్వానం వచ్చిందనీ, అయితే, బీజేపీతో పొత్తులో వున్నందున, ఆ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చామనీ, డీలిమిటేషన్ విషయమై తాము మాట్లాడాల్సిన వేదికలపై మాట్లాడతామని జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.