Delhi Police: రాజధాని ఢిల్లీ (Delhi)లోని రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) లో ఆదివారం జరిగిన కేంద్ర కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ జంతువులాంటి ఆకారం కనిపించిన సంగతి తెలిసిందే. లైవ్ వీడియోలో ప్రత్యక్షం కావడంతో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ఉయికే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రిజిస్టర్ లో సంతకం చేశారు. అనంతరం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపేందుకు సిద్ధమవుతూండగా.. ఆయన వెనుకగా మెట్ల పై భాగంలో నాలుగు కాళ్ల జంతువు ఆకారం వెళ్లడం కనిపించింది.
దీంతో నెటిజన్ల నుంచి అనేక అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అది పులి, చిరుతపులి.. ఏఐ మ్యాజిక్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై పోలీసులు స్పందించారు. ‘రాష్ట్రపతి భవన్ లో జంతువు సంచారం వార్త విన్నాం. దీనిపై సంబంధిత భద్రతా అధికారులతో మాట్లాడాం. రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఎటువంటి చిరుతపులి లేదని నిర్ధారించారు. కుక్కలు, పిల్లులు మాత్రమే ఉన్నట్టు చెప్పారు. అది పిల్లి మాత్రమే. ఎటువంటి వదంతులకు అవకాశం ఇవ్వొద్ద’ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.