అదేంటో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు తెరపైకొస్తుంటాయ్.! కామెడీ కాదు, సీరియస్.! అన్నట్టుగానే వుంటాయ్ ఆయా వ్యవహారాలు.
వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ‘గుండె పోటు – గొడ్డలి పోటు’ వ్యవహారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన ‘కోడి కత్తి’ దాడి వ్యవహారంపైనా చాలా చాలా అనుమానాలున్నాయి అందరికీ.
పై రెండు ఘటనలూ చంద్రబాబు హయాంలోనే జరిగాయి. వైసీపీ హయాంలోనూ అంతకు మించిన అద్భుతాలు జరుగుతున్నాయ్. ఎక్కడన్నా ఏదన్నా అత్యాచారం జరిగితే, ఆ వెంటనే దాన్ని టీడీపీకి ముడిపెట్టేయడం వైసీపీకి పరిపాటిగా మారింది.
కొద్ది రోజుల క్రితం ఏలూరు జిల్లాలో వైసీపీకి చెందిన కింది స్థాయి నేత ఒకరు చనిపోతే, ఈ కేసులో అధికార పార్టీకి చెందిన నాయకుల పేర్లే తెరపైకొచ్చాయ్. పోలీసులు కూడా ఆ దిశగానే కేసులు నమోదు చేశారు. కానీ, ఆ హత్య వెనుక టీడీపీ హస్తం వుందంటూ వైసీపీ ఆరోపించింది. ఇంతకన్నా దిగజారుడతనం ఇంకేముంటుంది.?
తాజాగా, కాకినాడలో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ కారులో ఓ మృతదేహం కలకలం సృష్టించింది. స్వయానా ఎమ్మెల్సీ, కారులో మృతదేహాన్ని పెట్టుకుని.. బాధిత కుటుంబం దగ్గరకు వెళ్ళారు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి చనిపోయాడన్నది ఎమ్మెల్సీ ఆరోపణ. చనిపోయిన వ్యక్తి, ఎమ్మెల్సీ వద్దనే గతంలో డ్రైవర్‌గా పనిచేశాడు.
ఎమ్మెల్సీనే, సుబ్రహ్మణ్యంని పిలిచాడనీ.. వెళ్ళాక అతనిపై దాడి చేసి చంపేశారనీ.. బాధిత కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ‘మానవతా దృక్పథంతో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్సీ, ఆ వ్యక్తి చనిపోయాడని తెలుసుకుని, మృతదేహాన్ని కుటుంబ సభ్యలుకు అందించేందుకు తన కారులో తీసుకెళ్ళారు..’ అన్నది వైసీపీ వెర్షన్.
అసలు స్క్రిప్టులు ఎవరు రాస్తున్నారోగానీ.. నభూతో నభవిష్యతి.! ఒకదాన్ని మించి ఇంకో స్క్రిప్ట్ వుంటోంది.