రంపచోడవరం వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. కారులో ఉన్న మృతదేశం ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ఎమ్మెల్సీ వద్ద ఐదేళ్లుగా సుబ్రమణ్యం డ్రైవర్‌గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుఝామున డ్రైవర్‌ను ఎమ్మెల్సీ తీసుకెళ్లడం.. అనంతరం ఆయన మృతి చెందడం సంచలనం రేపుతోంది.
గురువారం ఉదయం సుబ్రమణ్యంను అనంతబాబు వెంట తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు అంటున్నారు. అనంతరం ప్రమాదానికి గురై సుబ్రమణ్యం మరణించాడని ఆయన తమ్ముడుకి ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు సమాచారం ఇచ్చాడని తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు తన కారులోనే సుబ్రమణ్యం మృతదేహాన్నికాకినాడకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఎమ్మెల్సీ అనంతరం వేరే కారులో వెళ్లిపోయారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుబ్రమణ్యంను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండడంతో రాజకీయ వివాదానికి తెరలేచింది. ప్రస్తుత ఉదంతంతో ఎమ్మెల్సీ అనంత బాబు, అధికార పార్టీ చిక్కుల్లో పడినట్టే అనే వార్తలు వస్తున్నాయి.