‘తప్పులు జరుగుతున్నాయ్.. నేరాల్ని అదుపు చేసే పరిస్థితి లేకపోతే ఎలా.? ప్రభుత్వంలో వున్నాం, బాధ్యత తీసుకోవాలి. హోంమంత్రి అనితగారూ, బాధ్యత తీసుకోండి. అధికారులు కొందరు సరిగ్గా పని చేయడంలేదు. వారినీ హెచ్చరిస్తున్నాను. మీకు చేతకాకపోతే, హోంమంత్రిత్వ శాఖని నేను తీసుకోవాల్సి వస్తుంది..’
ఇదీ జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యల సారాంశం.
అంతే, వైసీపీ శ్రేణులు ‘దళిత బిడ్డ విషయంలో ఇంత దుర్మార్గమా..’ అంటూ సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. మరోపక్క, టీడీపీ శ్రేణులు కూడా, ‘మీ ఇష్టమేనా అంతా.?’ అంటూ రెచ్చిపోతున్నాయి.
జనసేనాని పవన్ కళ్యాణ్, ఏ విషయమైనా కుండబద్దలుగొట్టేస్తారు. ఇక్కడ, ఫిల్టర్స్ ఏమీ వుండవు. జరుగుతున్న దారుణాలపై విపక్షాల నుంచి వచ్చే ఒత్తిడి సంగతెలా వున్నా, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదన్నది ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో వున్న పవన్ కళ్యాణ్ ఆవేదన.
కొత్త ప్రభుత్వం ఏర్పాటై, నెలలు గడుస్తున్నాయ్.. ఆర్నెళ్ళ దాకా హనీమూన్ పీరియడ్ అనుకున్నా.. అదింకా పూర్తి కాలేదనుకున్నా.. ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలు వేరుగా వుంటాయ్. గత ప్రభుత్వ వైఫల్యాల నేపథ్యంలో రాష్ట్రంలో నేరాలు సర్వసాధారణమైపోయాయనీ, నేరస్తులకి భయం లేకుండా పోయిందనీ పవన్ కళ్యాణ్ స్పష్టంగానే చెప్పారు. అది నిజం కూడా.!
సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన పోస్టుల నేపథ్యంలో కొన్ని అరెస్టులు జరుగుతున్నాయ్.. కానీ, వెంటనే వాళ్ళు బెయిల్ మీద విడుదలై, మళ్ళీ అవే నేరాలకు పాల్పడుతున్నారు. ఎప్పుడైతే, నేరానికి శిక్ష పడదో.. నేరస్తులకి భయం అనేది వుండదు. పోలీసులు, కేసులు నమోదు చేసేటప్పుడే, ఆ కేసులు బలంగా వుండేలా చూసుకోవాలి.
హోంమంత్రిత్వ శాఖ నేరాల విషయమై అత్యంత అప్రమత్తంగా వుండాలి. ఇదే కదా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పింది.? పైగా, ప్రజల నుంచి వస్తున్న వినతులు, ఫిర్యాదుల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై విధంగా స్పందించారు.
‘అవును, సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా.. ఆయా శాఖల మంత్రులను హెచ్చరించే అధికారాన్ని కలిగి వుంటారు. ఆయా మంత్రులు, సీఎం అలాగే డిప్యూటీ సీఎం హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకుని మరింత బాధ్యతగా వ్యవహరించాలి..’ అని మంత్రి నారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ చెప్పారు.
ఇక్కడ ఓ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నెంబర్ వన్ అయితే, పవన్ కళ్యాణ్ నెంబర్ టూ.! ఓ బాధ్యతగల ఉప ముఖ్యమంత్రిగా, ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం సడలిపోకుండా బాధ్యత తీసుకోవడం పవన్ కళ్యాణ్ తప్పెలా అవుతుంది.?
వైసీపీ, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఉలిక్కిపడటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ‘పవన్ కళ్యాణ్ మాట్లాడింది కరెక్ట్..’ అని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ‘పవన్ కళ్యాణ్ ఇలా వుండాలనే, ఆయన్ని గెలిపించాం.. పవన్ కళ్యాణ్‌ని నమ్మి కూటమికి అధికారమిచ్చాం..’ అని ప్రజలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంపై హోం మంత్రి అనిత స్పందించాల్సి వుంది.