దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయ్.! వచ్చాయా.? లేదా.? అన్నది తర్వాతి సంగతి. దావోస్ వేదికగా, ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల పరిస్థితుల గురించి ప్రపంచ వ్యాప్త సంస్థలకు తెలియజేసుకునేందుకు ఆస్కారముంటుంది. తద్వారా, ఆయా రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయి సంస్థలు పెట్టబడులు పెట్టేందుకు ముందుకొస్తాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది దావోస్ పర్యటనను లైట్ తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం, దావోస్ వెళ్ళింది.. అక్కడ పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణకు పలు భారీ సంస్థలు పెట్టబడులు పెట్టేందుకు రాబోతున్నాయి కూడా.
దావోస్ ఎందుకు వెళ్ళలేదు.? అంటే, త్వరలో విశాఖ కేంద్రంగా ‘భారీ ఈవెంట్’ నిర్వహించబోతున్నామనీ, దానికి ఏర్పాట్లు చేసుకోవాలి గనుక, వెళ్ళలేకపోయామన్నది ఏపీ ప్రభుత్వ వాదనగా కనిపిస్తోంది. ఐటీ శాఖ మంత్రి లేదా, ఏదో ఒక శాఖకు చెందిన మంత్రి, దావోస్ వెళ్ళేంత తీరిక లేకుండా వున్నారా.? ఏపీలో వుండి.. ఆయా మంత్రులు చేసేది, పవన్ కళ్యాణ్‌ని తిట్టడమే కదా.! ఓహో, ఆ తిట్టే శాఖ బలహీన పడుతుందని బహుశా వైసీపీ ఆలోచించిందేమో.
ఇదిలా వుంటే, ‘మేం దావోస్ వెళ్ళడం కాదు.. దావోస్ పెద్దల్నే ఇక్కడికి రప్పిస్తాం..’ అంటోంది వైసీపీ. సరిపోయింది సంబరం. ‘మేం పెట్టబడులు తీసుకురావడం కాదు.. మేమే వెళ్ళి పెట్టుబడులు పెడతాం..’ అన్నట్టుంది.! రాష్ట్రమేంటి.? రాష్ట్ర ఆర్థిక అవసరాలేంటి.? అభివృద్ధి సంగతేంటి.? ఇలాంటి విషయాల్లో అస్సలేమాత్రం సోయ లేదు వైసీపీకి.
దావోస్ పెద్దల్ని రప్పించి, రాష్ట్రంలో ఏం చూపిస్తారు.? గుంతల రోడ్లు చూపిస్తారా.? అసలు రాష్ట్రానికి రాజధాని ఏదని చెబుతారు.? మూడు ముక్కల రాజకీయం, మూడు ముక్కల పాలన గురించి బహుశా ప్రెజెంటేషన్లు ఇస్తారేమో.!