Daku Maharaj: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సూపర్ హిట్టయిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం విజయోత్సవ సభ నిర్వహించింది చిత్ర యూనిట్. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది. బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది యూనిట్.
బాలకృష్ణ.. ” నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, కళామతల్లి ఆశీర్వాదం కలగలిపితే డాకు మహారాజ్. వరుసగా ఇది నాకు నాలుగో విజయం. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ప్రతి సినిమాని ఛాలెంజ్ గా తీసుకొని చేసినవే. సినిమాని ఆదరించి, అఖండమైన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. నన్ను ఎంతగానో ప్రేమించి, నాలో ఉన్న నట విశ్వరూపాన్ని ఆవిష్కరించేలా చేశాడు బాబీ. మంచి సన్నివేశాలతో, క్లుప్తంగా, అందంగా సినిమాని రూపొందించాడు. ఎస్.ఎస్.థమన్ పేరును నందమూరి థమన్ చేసేశారు. నేనైతే ఎన్.బి.కె. థమన్ అని నామకరణం చేస్తున్నాను. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతమైన నటనతో అలరించారు. నా అభిమాని, నిర్మాత వంశీ కొత్త బాలకృష్ణను ఆవిష్కరించాలని ఆయన కల నిజమైంది. అద్భుతంగా నటించిన వేదకు మంచి భవిష్యత్ ఉంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. నా వరకు నా రికార్డులన్నీ అన్ స్టాపబుల్, నా కలెక్షన్లు అన్ స్టాపబుల్, నా అవార్డ్స్ అన్ స్టాపబుల్, నా రివార్డ్స్ అన్ స్టాపబుల్’ అన్నారు.
బాబీ కొల్లి.. “బాలకృష్ణ ఫిల్మోగ్రఫీలో గుర్తుండిపోయే సినిమాలలో ఒకటిగా నిలవాలనే ఉద్దేశంతో ‘డాకు మహారాజ్’ తెరకెక్కించాం. డిస్ట్రిబ్యూటర్లకు మూడు రోజుల్లోనే రిటర్న్స్ రావడం దర్శకుడికి దక్కే ఆనందం. బ్లాక్ బస్టర్లు వస్తాయి కానీ.. రెస్పెక్ట్ అరుదుగా వస్తుంది. ‘డాకు మహారాజ్’ తో అదే దక్కింది. బెస్ట్ బాలకృష్ణ గారిని చూపించాల నుకున్నాను. దర్శకుడిని బాలకృష్ణ ఎంతో నమ్ముతారు. పాత్రలో పరకాయప్రవేశం చేస్తారు. శ్రద్ధా శ్రీనాథ్ తన పాత్రకు ప్రాణం పోశారు. ప్రగ్యా జైస్వాల్ కి థాంక్యూ. వేదకు చాలా టాలెంట్ ఉంది. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతఙ్ఞతల”ని అన్నారు.
నాగవంశీ.. “నన్ను, బాబీని నమ్మి సినిమా చేసే అవకాశం ఇచ్చిన బాలకృష్ణగారికి కృతఙ్ఞతలు. బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలనే ఉద్దేశం డాకు మహారాజ్ తో నెరవేరింది. జనవరి 12న సినిమా విడుదలైతే, సంక్రాంతి పండుగ రోజుకే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ కి వెళ్లిపోవడం మాకు పెద్ద సక్సెస్”అని అన్నారు.
థమన్.. “సక్సెస్ చాలా గొప్పది. ఈరోజుల్లో నిర్మాత విజయం సాధించడం అంత తేలికైన విషయం కాదు. నిర్మాతను ఒక దేవుడిలా చూడాలి. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా వెనుక నిర్మాత డబ్బుతో పాటు, ఎందరో కష్టం దాగి ఉంటుంది. కాబట్టి అలాంటి సినిమాని కాపాడే బాధ్యత మనందరికి ఉంది. ‘డాకు మహారాజ్’ సినిమా విషయానికి వస్తే.. బాలకృష్ణ గారు నట విశ్వరూపం చూపిస్తున్నారు కాబట్టే, నేను ఆ స్థాయి సంగీతం ఇవ్వగలుగుతున్నాను. బాలయ్య గారిని ఎప్పుడు చూసినా నాకు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాన”ని అన్నారు. కార్యక్రమంలో హీరోయిన్లు ప్రజ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాధ్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు.