Daku Maharaj: నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త సినిమా ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సనిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తమన్ సంగీతం అందించిన సినిమా ఈరోజు విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాకి వస్తున్న స్పందనపై సంతోషం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించింది యూనిట్.
బాబీ కొల్లి.. “తెలుగు ప్రేక్షకులు అందరికీ థాంక్స్. బాలకృష్ణగారితో బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలని టీమ్ ఎంతో కష్టపడ్డాం. బాలకృష్ణగారి కెరీర్లో గొప్ప సినిమాల్లో ఒకటిగా ‘డాకు మహారాజ్’ నిలుస్తుందని గతంలో నాగవంశీ చెప్పిన మాటలు నిజమయ్యాయి. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య.. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ విజయాలతో సంక్రాంతి నాకు ప్రత్యేకమైన పండుగలా మారిపోయింది. తమన్ సంగీతం సినిమాకి మెయిన్ పిల్లర్. బాలకృష్ణ గారు చాలా హ్యాపీగా ఉన్నార’ని అన్నారు.
నాగవంశీ.. ‘సినిమా చూసి బాలకృష్ణగారి అభిమానులు సంతోషంగా ఉన్నారు. అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈవారంలోనే అనంతపురంలో సక్సెస్ మీట్ నిర్వహిస్తా’మని అన్నారు. సమావేశంలో నటీమణులు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాధ్, ఊర్వశి రౌతేలా పాల్గొని విజయవంతమైన సినిమాలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.