పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న అడివి శేష్ ఇప్పుడు ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. యాక్షన్, ప్రేమ, భావోద్వేగాలను కలగలిపిన ఈ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా చుట్టూ మరింత హైప్‌ను తీసుకొచ్చాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఒక ప్రేమకథలో యాక్షన్‌ను కొత్త తరహాలో చూపించే ప్రయత్నంగా ‘డెకాయిట్’ కనిపిస్తోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ, ఈ సినిమా మొదలైనప్పుడే తనకు మంచి వైబ్ వచ్చిందని చెప్పారు. “డెకాయిట్ ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు” అని ఆయన చెప్పడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. సుప్రియ ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా నిర్మించిందని, మొత్తం టీమ్ మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో పని చేసిందని ఆయన పేర్కొన్నారు. ట్రైలర్ చూస్తేనే ఇది విజయవంతమైన సినిమా అవుతుందని అనిపించిందని, ఒక లవ్ స్టోరీలో ఇంత ఇంటెన్స్ యాక్షన్ ఉండటం చాలా కొత్తగా ఉందని అన్నారు.
అడివి శేష్ గురించి కూడా వెంకటేష్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘పంజా’ సమయంలోనే శేష్‌లో ఒక అద్భుతమైన నటుడిని చూసానని, తర్వాత ఆయన చేసిన సినిమాలు వరుసగా హిట్స్ కావడం ఆశ్చర్యంగా లేదని అన్నారు. ‘డెకాయిట్’ కూడా ఆ విజయాల సరసన నిలుస్తుందని, ఇది శేష్ కెరీర్‌లో మరో బలమైన మైలురాయిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే, ఈ సినిమా ఆమె కెరీర్‌లో బెస్ట్ వర్క్‌లలో ఒకటిగా నిలుస్తుందని వెంకటేష్ నమ్మకం వ్యక్తం చేశారు.
హీరో అడివి శేష్ కూడా ఈ వేడుకలో చాలా భావోద్వేగంగా మాట్లాడారు. ‘డెకాయిట్’ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని, ఈ కథను ప్రాణం పెట్టి చేశానని చెప్పారు. ఈ సినిమా కోసం దర్శకుడు షానియల్ డియోతో కలిసి చాలా కష్టపడ్డామని, ఇది కేవలం ఒక సినిమా కాకుండా ఇద్దరూ కలసి కనుకున్న ఒక కల అని అన్నారు. సినిమా పూర్తయ్యే చివరి నిమిషం వరకు కూడా దర్శకుడు వర్క్ చేస్తూనే ఉన్నాడని, టీమ్ మొత్తం ఈ ప్రాజెక్ట్‌పై ఎంత ప్రేమతో పని చేసిందో ప్రేక్షకులు థియేటర్లలో చూస్తారని చెప్పారు. “ఏప్రిల్ 10న మీరు ఒక హానెస్ట్ సినిమా చూస్తారు. మా ప్యాషన్ చూస్తారు” అని శేష్ చెప్పడం అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచింది.
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ, ‘సరస్వతి’ పాత్ర తన కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రగా నిలుస్తుందని చెప్పారు. కథ విన్నప్పుడే ఈ సినిమా చేయాలనిపించిందని, శేష్‌తో పని చేయడం చాలా మంచి అనుభవమని తెలిపారు. దర్శకుడు షానియల్ డియో ఈ పాత్రను అద్భుతంగా మలిచారని, నిర్మాత సుప్రియ చాలా కేరింగ్ ప్రొడ్యూసర్ అని పేర్కొన్నారు. వెంకటేష్ ఎదుట నిలబడి మాట్లాడటం తనకు గౌరవంగా అనిపించిందని కూడా ఆమె అన్నారు.
ఈ వేడుకలో పాల్గొన్న సిద్దు జొన్నలగడ్డ, సుమంత్, భీమ్స్, నాగ వంశీ, సురేష్ బాబు, స్వప్న దత్, రాహుల్ రవీంద్ర, కార్తీక్ ఘట్టమనేని, శౌర్యువ్, శశికిరణ్ తిక్క, అబ్బూరి రవి తదితరులు కూడా సినిమా టీమ్‌ను అభినందించారు. సినిమా ట్రైలర్, టీజర్, మ్యూజిక్ అన్నీ కలిసి మంచి అంచనాలు తీసుకొచ్చాయని, ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని చాలా మంది నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద స్థాయిలో మద్దతు రావడం ‘డెకాయిట్’పై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపించింది.
సినిమా విడుదలకు ముందే ఇంతటి పాజిటివ్ టాక్ రావడం, ఈవెంట్‌లో ప్రముఖులు వరుసగా బ్లాక్‌బస్టర్ మాటలు మాట్లాడటం, శేష్-మృణాల్ జంటపై ఉన్న ఆసక్తి— అన్నీ కలిసి ‘డెకాయిట్’ను ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ రిలీజెస్‌లో ఒకటిగా నిలబెట్టాయి. ఏప్రిల్ 10న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి కానీ, ప్రస్తుతం మాత్రం ‘డెకాయిట్’ చుట్టూ ఉన్న హైప్ చాలా బలంగా కనిపిస్తోంది.
