నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన “డాకు మహారాజ్” సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా గురువారం ఏపీలోని అనంతపురంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని మూవీ టీమ్ ఏర్పాట్లు చేసింది. ఈ ఈవెంట్ కు ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే బుధవారం తిరుపతి లో జరిగిన తొక్కిసలాట ఘటనకు విచారం వ్యక్తం చేస్తూ మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
” తిరుపతిలో జరిగిన ఘటనకు మా టీమ్ ఎంతో విచారిస్తుంది. మన సంస్కృతిలో భాగమైన పవిత్రమైన స్థలంలో ఇలాంటి హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి సమయాల్లో “డాకు మహారాజ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపలేం. భక్తుల మనోభావాలకు విలువిస్తూ ఈరోజు జరపాల్సిన ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నాం. ఇలాంటి కష్ట సమయాల్లో మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం” అని చిత్ర బృందం పేర్కొంది.