ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మొంథా తుపాను భారీ నష్టాన్ని మిగిల్చిందని మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నివేదికతో వివరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ భేటీలో తుపాను ప్రభావం, నష్టాల వివరాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు పూర్తిగా వెల్లడించారు. మొంథా తుపాను అక్టోబర్ 28 రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటిన సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో వీచిన గాలులు, కురిసిన వర్షాలతో మొత్తం 3,109 గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తక్షణ సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వం వెంటనే 1.92 లక్షల మందిని 2,471 పునరావాస శిబిరాలకు తరలించి అవసరమైన ఆహారం, నీరు, పాలు, ఇతర అవసరమైన వస్తువులు సరఫరా చేసింది. ప్రతి ప్రభావిత కుటుంబానికి రూ.3,000 తక్షణ సహాయంగా అందించింది. చెట్లు తొలగించడం, తాత్కాలిక వసతులు కల్పించడం, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి చర్యలు వేగంగా చేపట్టినట్లు మంత్రులు తెలిపారు.
మొత్తం రూ.6,352 కోట్ల నష్టం జరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, గృహ నష్టం రూ.7 కోట్లు, రహదారులు–మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు–నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు రూ.48 కోట్ల నష్టం జరిగినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.60 కోట్లు తక్షణ సహాయంగా విడుదల చేసింది.
NDRF మార్గదర్శకాల ప్రకారం ఈ మొత్తం నష్టంలో రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, పునరుద్ధరణ కోసం అర్హమైనవని మంత్రి లోకేష్ వివరించారు. గత నెల 12న సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్రమంత్రుల బృందం (IMCT) ఈ ప్రాంతాలను పరిశీలించిందని తెలిపారు. అమిత్ షాతో భేటీలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా పాల్గొన్నారు.
ఈ నివేదికతో కేంద్రం త్వరితగతిన స్పందించి సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్లు తెలిపారు.
