Cyclone Biparjoy: ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు కారణం ఆగ్నేయ అరేబియా (Arabian sea) సముద్రంలో ఏర్పడిన తుపాను ‘బిపర్ జాయ్’ (Cyclone Biparjoy) కారణమని అంటున్నారు. ఇప్పటికే ఆరు రోజుల ఆలస్యమైన రుతుపవనాల రాక తుపాను కారణంగా మరింత ఆలస్యమవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మరో 2-3 రోజులు ఆలస్యంగా రుతు పవనాలు కేరళ (Kerala) తీరాన్ని తాకే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే.. గతేడాది జూన్ 1నే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడం విశేషం.
వాతావరణ మార్పులే ఇందుకు కారణంగా అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1కి శ్రీలంకను కూడా దాటకపోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది. రుతుపవనాలు ఆలస్యంగా 4వ తేదీకి తాకొచ్చని అంచనా వేసినా నేటీకీ వాటి జాడ లేదు. ఇప్పుడు తుపాను ప్రభావంతో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తుపాను వేగంగా బలపడుతోంది. ప్రస్తుతానికి బిపర్ జాయ్ తుపాను గోవాకు 890 కి.మీ దూరంలో, ముంబైకి 1000 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది.