Cyber Crime: సినిమా ప్రమోషన్లతో భారీ లాభాలు సంపాదించొచ్చంటూ వ్యక్తిని కోట్లలో మోసం చేసిన ఇద్దరు మాయగాళ్లపై పోలిస్ కేసు నమోదైంది. బాధితుడు వారి మాటలు నమ్మి రూ.1.34కోట్లు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కు చెందిన ప్రైవేటు ఉద్యోగి 2024 అక్టోబరులో విహారానికి గోవా వెళ్లి బిగ్ డాడీ క్యాసినోవాకు వెళ్లాడు.
అక్కడ శ్రీలంకకు చెందిన ఉదయ్ రాజ్, వివేక్ పరిచయమై తాము తెలుగు సినిమాలకు ప్రమోషన్ చేసి లాభాలు ఆర్జిస్తున్నామంటూ నమ్మబలికారు. అదేనెలలో ఉదయ్ రాజ్ హైదరాబాద్ వచ్చి బాధితుడిని కలిసి OGకి ప్రమోషన్ చేస్తున్నామంటూ నమ్మించాడు. ప్రస్తుతం అమరన్ సినిమా ప్రమోషన్ కు రూ.20లక్షలిస్తే రెట్టింపు లాభాలొస్తాయని చెప్పాడు.
బాధితుడు నమ్మి నగదు ఇవ్వగా.. వారంలో 25లక్షలు తిరిగిచ్చి నమ్మించారు. ఆపై.. గేమ్ చేంజర్, కంగువా, పుష్ప-2 సినిమాల ప్రమోషన్ కోసం అడగడంతో బాధితుడు తన ఇంటిని అమ్మి, నగదు తాకట్టుపెట్టి, అప్పు చేసి మొత్తంగా రూ.1.34కోట్లు చెల్లించాడు. అయితే.. ఇప్పటికీ వారు నగదు ఊసెత్తకపోవడంతో మోసపోయానని గ్రహించి సీసీఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.