సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. పార్టీ కార్యకలాపాల్లో ఉండగా అస్వస్థతకు గురికావడంతో ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఈయన 12 ఆగస్టు 1952 లో చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఏచూరి మొదట వీణ మజుందార్ కుమార్తె ఇంద్రాణి మజుందార్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తర్వాత ఆయన ప్రముఖ జర్నలిస్ట్, ది వైర్ ఎడిటర్ సీమా చిస్తీ ని వివాహం చేసుకున్నారు. తన భార్య సీమా తనకు ఆర్థికంగానే కాకుండా అన్ని విషయాల్లోనూ మద్దతుగా ఉంటుందంటూ ఏచూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఎకనామిస్ట్, కాలమిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఏచూరి పలు పుస్తకాలు కూడా రాశారు. 1992 నుంచి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 1974 లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లో చేరిన ఏచూరి.. ఆ తర్వాత సీపీఎం లో చేరారు. 1975 లో విధించిన ఎమర్జెన్సీ సమయంలో ఆయన యాక్టివ్ గా ఉండటంతో అరెస్ట్ అయ్యారు.2005 లో వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2017 వరకు ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగారు.