నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్ పోస్టర్ బ్యానర్‌లో నాని సమర్పణలో రాబోతున్న మూవీ ‘కోర్ట్’. ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా పూర్తిగా కోర్టు రూం డ్రామా కాగా, అందులో ఒక క్యూట్ లవ్ స్టోరీని దర్శకుడు రామ్ జగదీష్ చూపించబోతున్నారు. నాని చాలా నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా మార్చి 14న విడుదల కాబోతుంది. ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు రామ్ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలను పంచుకున్నాడు.
రామ్ జగదీష్ మాట్లాడుతూ.. సినిమా కథ ఫోక్సో యాక్ట్ చుట్టూ అల్లుకుని రూపొందించడం జరిగింది. తాను నిజ జీవితంలో ఫోక్సో కేసు గురించి తెలుసుకున్నప్పుడు షాక్ అయ్యాను. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. పోలీసుల సహకారంతో చాలా కేసుల మీద రీసెర్చ్ చేశాను. వాటన్నింటిని స్క్రీన్‌పై చూపిస్తే బాగుంటుంది కదా అనిపించింది. అందుకే ఈ కథను ఎంపిక చేసుకున్నాను. ఈ సినిమా కోసం ఫోక్సో చట్టం గురించి మొత్తం తెలుసుకున్నాను, అంతే కాకుండా పోలీసులు, కోర్టు, లా ఇలా చాలా వరకు తెలియని విషయాలను గురించి తెలుసుకున్నాను. మన జీవితాన్ని మనకు చూపించేది ఈ సినిమా అన్నాడు.
ఈ కథను నాని గారికి చెప్పడం కోసం 8 నెలలు వెయిట్ చేశాను. కథ విన్న వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా అన్నారు. ఆ మూమెంట్‌ను ఎప్పటికీ మరచిపోలేను. ఇప్పటి వరకు కోర్ట్ రూం డ్రామాలు చాలానే చూశాం. అయితే ఇందులో ఒక లవ్ స్టోరీని కూడా చూపించడం వల్ల కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో చందు పాత్రను పోషించడం కోసం రోషన్ చాలా కష్టపడ్డాడు. శ్రీదేవి కూడా చక్కని లుక్‌తో ఆకట్టుకుంది. నేను ఈ సినిమా ఐడీయా అనుకున్నప్పుడు మొదట ప్రియదర్శికి చెప్పాను. ఆ సమయంలోనే తానే ఈ సినిమాలో చేస్తాను అన్నాడు, అన్నట్లుగానే చివరకు ప్రియదర్శి లాయర్‌గా నటించాడు.
ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్ని సినిమాలు చేశాను, కొన్ని సినిమాలకు కథలు రాసే అవకాశాలు దక్కాయి. ఫార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇలా చాలా కాలంగా ఇండస్ట్రీలో తాను కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లకు తనకు వచ్చిన ఈ అవకాశంను సద్వినియోగం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు. తప్పకుండా నాని గారి నమ్మకంను నిలబెట్టడంతో పాటు ప్రేక్షకుల అంచనాలకు అందుకునే విధంగా సినిమా ఉంటుంది అని రామ్ జగదీష్ హామీ ఇచ్చాడు.