వావ్.! ఆంధ్రప్రదేశ్ రాజకీయం భలేగుంది.! అధికార వైసీపీ, ఓటర్లను కొనేస్తున్న వైనం గురించి తిరుపతి ఉప ఎన్నిక సమయంలోనే ససాక్ష్యంగా నిరూపితమయిపోయింది. భర్త ఎవరో తెలియని భార్య, తండ్రి ఎవరో తెలియని కుమారుడు.. ఇలా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ కొనుగోలు చేసిన నకిలీ ఓటర్ల లీలలు అన్నీ ఇన్నీ కావు.
175 నియోజకవర్గాలకుగాను మొత్తంగా అన్ని నియోజకవర్గాల్నీ గెలిచేసుకుంటాం.. అని వైసీపీ చెబుతోందిగానీ, ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో ‘గేలి’చేస్తోంది ఈ బులుగు రాజకీయం.! స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేశామని బహు గొప్పగా చెప్పేసుకుంటుంటుంది వైసీపీ. కానీ, ఎలా గెలిచిందీ.. వైసీపీ నేతలే చెబుతున్నారిప్పుడు.!
కుప్పంలో వైసీపీ ఎలా గెలిచిందన్నదానిపై ఓ ప్రజాప్రతినిథి భర్త, ఓ అధికారిక సమావేశంలోనే వెల్లడించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ‘ఓటుకు 5 వేలు ఖర్చు చేసి గెలిచాం..’ అని చెప్పుకున్నాడాయన కుప్పం మునిసిపాలిటీ వ్యవహారంపై.
తాజాగా, ఇంకో వైసీపీ నాయకుడు, ‘జనాన్ని రప్పించడం చాలా కష్టంగా మారుతోంది.. అధికార పార్టీ కార్యక్రమాలకీ, ప్రభుత్వ కార్యక్రమాలకీ.. వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే వచ్చేందుకు జనం సిద్ధంగా లేరు. పోనీ, అలా వచ్చినవాళ్ళైనా సభ జరిగే వరకు వుంటున్నారా.? అంటే అదీ లేదు..’ అంటూ వాపోయాడు.
ఇవన్నీ చాలక, తాజాగా అధికార పార్టీ నాయకులకి ‘చెప్పు చూపించడం’ అనేది ట్రెండింగ్ అయిపోయింది. ఈ మధ్యనే ఓ వైసీపీ నేత పుట్టినరోజు వేడుకల్లో రికార్డింగ్ డాన్సులు పెడితే, యువత కేరింతలు కొట్టారు.. పనిలో పనిగా జగనన్న పాటలకు డాన్సులేస్తూ.. చెప్పలు చూపించారు.
దాంతో, అవాక్కయ్యారు నిర్వాహకులు. కారణం, జగనన్న పాట ప్లే అవుతోంటే, ‘అరటి తొక్క’ పాటేసుకున్నారు యువత. చెప్పుల మోత మోగిపోతుండడంతో, ‘పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆ యువతని బతిమాలుకోవాల్సి వచ్చింది’.!
ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారిన, మారుతున్న రాజకీయ ముఖ చిత్రం.