దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోయింది. వరుసగా రెండో రోజు కూడా లక్షకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. పైగా.. ముందురోజు కంటే 21 శాతం పెరుగుదల నమోదైంది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుత గణాంకాలు విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 1,41,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ కేసుల రేటు 9.28కి పెరిగాయి. ఎక్కువగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మహారాష్ట్రలో 40వేలకు పైగా కేసులు నమోదైతే.. ఒక్క ముంబైలోనే 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బెంగాల్లో 18వేలు, ఢిల్లీలో 17వేల కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసులు 4,72,169 ఉన్నాయి. ఒమిక్రాన్ కేసులు ప్రస్తుతం దేశంలో 3,071గా ఉన్నాయి. ప్రస్తుతం వీరిలో 1,203 మంది కోలుకున్నారు. టీకాల పరంగా ఇప్పటివరకూ దేశంలో 150 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.