తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి తో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్ కి గురి చేశారు. వ్యక్తిగత కారణాలవల్ల తమ 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఇటీవలే వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై ఆయన భార్య ఆర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుమతి లేకుండా, తనకు తెలియకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారని అన్నారు. ఆ ప్రకటన చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
” నాకు తెలియకుండానే ఆయన విడాకుల గురించి ప్రకటించారు. దాన్ని చూసి నేను దిగ్భ్రాంతికి గురయ్యా. నా అనుమతి తీసుకోకుండా ఇలా బహిరంగంగా ప్రకటించడం నన్ను బాధించింది. మేం 18 ఏళ్లుగా కలిసి ఉన్నాం. మా మధ్య నెలకొన్న మనస్పర్ధలను సామరస్యంగా చర్చించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఆయనతో నేరుగా మాట్లాడేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా. దురదృష్టవశాత్తు ఇప్పుడు నాకు అవకాశం లేదు.అన్యాయంగా నాపై నిందలు వేయడాన్ని తట్టుకోలేకున్నాను. ఓ తల్లిగా నా పిల్లల భవిష్యత్ నాకు ముఖ్యం. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది” అని ఆర్తి తన పోస్ట్ లో రాసుకొచ్చారు.