ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.! తెలుగు నేల ఎంతోమంది మహనీయుల్ని చూసింది. కొందరు రాజకీయ ప్రముఖులు, రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. అలాగే, కొందరు రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కూడా.! చరిత్ర ఇద్దర్నీ గుర్తు పెట్టుకుంటుంది.
రాజకీయం అన్నాక విమర్శలుంటాయ్.! పోయినోళ్ళంతా మంచోళ్ళే.. అన్నమాట, రాజకీయాలకూ వర్తిస్తుంది. స్వర్గీయ ఎన్టీయార్.. తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం. తెలుగు సినిమా రంంగలో ఆయన ఖ్యాతి గురించి కొత్తగా చెప్పేదేముంది.?
ఔను, స్వర్గీయ ఎన్టీయార్.. తెలుగు నాట రాజకీయాల్లో ఓ ప్రభంజనం సృష్టించారు. మరి, ఆయన రాజకీయ జీవితం ఎలా ముగిసింది.? అత్యంత బాధాకరంగా.! స్వర్గీయ ఎన్టీయార్ చివరి రోజుల్ని తలచుకుంటే, ఆయన అభిమానుల కంట నీరు అస్సలు ఆగదు. వెన్నుపోటు, అధికార మార్పిడి.. ఇలా ఏ పేరు అయినా పెట్టుకోవచ్చుగాక.!
స్వర్గీయ ఎన్టీయార్ మాత్రం, నమ్మినవాళ్ళ చేతుల్లోనే రాజకీయంగా వెన్నుపోటుకి గురయ్యారు. అదే సమయంలో, కుటుంబ సభ్యుల మాట కాదని, తెలుగు దేశం పార్టీ నాశనమయ్యేందుకు ‘కొందరికి అవకాశం’ ఇచ్చేశారు. తప్పు రెండు వైపులా వుందన్నది బహిరంగ రహస్యం.
గతం గతః ఇప్పుడేంటి.? స్వర్గీయ ఎన్టీయార్ మంచోడా.? కాదా.? పోయినోళ్ళంతా మంచోళ్ళే.. ఆ లెక్కన, స్వర్గీయ ఎన్టీయార్ కూడా మహనీయుడే. పరిపాలన చేసిన కాలంలో ఎన్టీయార్ తీసుకొచ్చిన సంస్కరణలు నిజంగానే అద్భుతం. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి, అత్యద్భుతమైన విజయాల్ని అందుకున్న మహానుభావుడాయన.
ఇవేవీ కాదనలేని వాస్తవాలు. అంతమాత్రాన, తెలుగు నేలకి స్వర్గీయ ఎన్టీయార్ మాత్రమే ‘ఐడెంటిటీ’ అనడం అత్యంత జుగుప్సాకరం. ఆత్మగౌరవం, అప్పడాల కర్ర.. ఇవన్నీ దేనికి.? ఎన్టీయార్‌ని తెలుగు జాతి ఆత్మగౌరవంగా అభివర్ణించే ఆ కొందరు, ఆ ఎన్టీయార్ చివరి రోజుల్లో.. ఆయన్ని దిక్కూ మొక్కూ లేకుండా వదిలేసిన విషయాన్ని చరిత్ర మర్చిపోదు కదా.?
స్వర్గీయ ఎన్టీయార్‌కి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ఈనాటిది కాదు.! మళ్ళీ దాని చుట్టూ బోల్డంత రచ్చ. జయంతికో, వర్ధంతికో ఈ రచ్చ చేసే సోకాల్డ్ ఎన్టీయార్ అభిమానులు, ఆయన మీద నిజంగా చూపిస్తున్నది అభిమానం కాదు.! జస్ట్ ఇదొక పబ్లిసిటీ స్టంట్ అంతే.