పోయినోళ్ళంతా మంచోళ్ళే.. అని పెద్దలు అనడం వినే వుంటాం మనలో చాలామంది. సరే, పోయినోళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోకూడదు గనుక పెద్దలు అలా చెప్పడం సర్వసాధారణమే. అలా, డాలర్ శేషాద్రి చాలా మంచోడు, చాలా చాలా గొప్పోడు.. అనాలా.? అంటే, ఆయన గొప్పోడా.? కాదా.? అన్నది కాదిక్కడ చర్చ
డాలర్ శేషాద్రి ఈ రోజు తెల్లవారు ఝామున గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సేవ నిమిత్తం విశాఖకు వచ్చిన డాలర్ శేషాద్రి, హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడం పట్ల టీటీడీ వర్గాలు తీవ్ర దిగ్రభాంతిని వ్యక్తం చేస్తున్నాయి.
శ్రీవారి సేవలో నాలుగు దశాబ్దాలుగా డాలర్ శేషాద్రి తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. డాలర్ శేషాద్రి లేకుండా శ్రీవారికి సంబంధించిన ప్రధాన కార్యక్రమాలేవీ జరగవన్న భావన చాలామందిలో వుంది. అంతలా శ్రీవారికి చేసే సేవా కార్యక్రమాల్లో డాలర్ శేషాద్రి కనిపిస్తుంటారు, తన ప్రత్యేకతను చాటుకుంటుంటారు.
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులు ఎంత పవిత్రంగా భావిస్తారో, రాజకీయ నాయకులు అంతకన్నా ఎక్కువగా ‘ప్రధాన ఆదాయ వనరు’గానో, ‘ప్రచారానికి పనికొచ్చే అంశం’గానో భావించడం కొత్తేమీ కాదు. రాజకీయ నిరుద్యోగులకు టీటీడీ పునరావాస కేంద్రమైందన్న విమర్శలు ఈనాటివి కావు.
ఇక, డాలర్ శేషాద్రి మరణం తర్వాత, ‘శేషాద్రి శిఖరాన..’ అంటూ తెలుగు మీడియాలోని ఓ వర్గం డాలర్ శేసాద్రి గురించి పుంఖానుపుంఖాలుగా కథనాల్ని బహు గొప్పగా తెరపైకి తీసుకొచ్చేందుకు పడుతున్న పాట్లు చూస్తే నవ్వు రాక మానదెవరికైనా.
కొన్నాళ్ళ క్రితం ఇదే డాలర్ శేషాద్రిని శ్రీవారికి ద్రోహం చేసినోడిగా చిత్రీకరించారు. శ్రీవారి బంగారు డాలర్ల కుంభకోణంలో డాలర్ శేషాద్రిని దోషిగా మీడియా డిక్లేర్ చేసేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ప్రముఖ రాజకీయ పార్టీలతోనూ, అధికారంలో వున్నవారితోనూ అత్యంత సన్నహితుడిగా వుంటూ, పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ, టీటీడీలో తన స్థానాన్ని పదిలపరచుకున్నాడనే ఆరోపణలు ఆయన మీద చాలా చాలా వచ్చాయి.
అవన్నీ ఇప్పుడు గల్లంతయ్యాయ్.. అందుకేనేమో పెద్దలు పోయినోళ్ళంతా మంచోళ్ళని చెప్పేది.