‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ, నానుంచి రాజకీయాలు దూరం కాలేదు’ అనే పది సెకన్ల ఆడియో పోస్ట్ తో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో రేపిన ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. ఆయన నటించి, విడుదలకు సిద్ధమవుతోన్న ‘గాడ్ ఫాదర్’ సినిమా డైలాగ్ అని కొందరు.. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారని మరికొందరు టీవీల్లో డిబేట్లు పెట్టారు.. పత్రికల్లో కథనాలుగా కూడా వచ్చాయి. అయితే.. చిరంజీవి రాజకీయ డైలాగ్ ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానాన్ని తాకింది.
ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తూ.. పార్టీ నేతలకు కొత్త గుర్తింపు కార్డులు ఇస్తోంది. ఈక్రమంలో చిరంజీవిని 2027 వరకూ ఏపీ పీసీసీ డెలిగేట్ గా పేర్కొంటూ కార్డు జారీ చేసింది. అయితే.. చిరంజీవి డైలాగ్ చెప్పిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ కార్డు జారీ చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ డైలాగ్ పై ఇప్పటివరకూ స్పందించకున్నా.. రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో, అభిమానుల్లో చిరంజీవి అటెన్షన్ క్రియేట్ చేశారు.