మా టీవీలో ప్రసారం అవుతున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. గజ్వేల్‌కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ లు కలిసి ఈ ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో వారు పేర్కొన్నదేమంటే, బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా సాగుతోంది. కుటుంబ విలువలను పాటించని వ్యక్తులను ఈ షోకు ఎంపిక చేస్తున్నారని వారు ఆరోపించారు. బిగ్ బాస్‌లో పాల్గొంటున్న కొంతమందికి సమాజంలో మంచి పేర్లు లేవని, అటువంటి వారిని ప్రోత్సహించడం తప్పు అని అభిప్రాయపడ్డారు.
అలాగే, షో నిర్వాహకులు ప్రజలకు సిగ్గు పడేలా ప్రవర్తన, సంభాషణలు చూపిస్తున్నారని, ఇటువంటి కార్యక్రమం యువతపై చెడు ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వెంటనే బిగ్ బాస్ షోను నిలిపివేయాలని, లేకపోతే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి బిగ్ బాస్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
“కర్ణాటకలో చేసినట్లే ఇక్కడ కూడా ఈ షోను బ్యాన్ చేయాలి. నాగార్జున సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. మంచి పేరు లేనివారిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ ఏ సందేశం ఇస్తుందో ప్రజలు ఆలోచించాలి” అని యువకులు అన్నారు.
ఈ ఫిర్యాదుతో బిగ్ బాస్ టీమ్ పై మరోసారి వివాదం చెలరేగింది. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ ప్రారంభించారు.

