గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘అడవి తల్లి బాట’ పథకం ద్వారా రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. డోలీ మోతల అవసరం లేకుండా గిరిజనులు సురక్షితంగా ప్రయాణించే పరిస్థితులు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.
గిరి ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయాలు విస్తరిస్తూ, పీఎం జన్మన్, ఉపాధి హామీ వంటి కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా నిధులను సమర్థంగా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో గిరిజన గ్రామాల ప్రజలు ఇప్పటికీ చిన్న సమస్యలకే ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు కూడా ఇంకా ఉన్నాయన్నారు.
ఆ ప్రాంతాల అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు నిబద్ధతతో పనిచేస్తే అనేక సమస్యలు క్షేత్ర, డివిజన్, జిల్లా స్థాయిల్లోనే పరిష్కారం కావచ్చని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతి సమస్యను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిందే అన్న భావన ప్రజల్లో తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. సమస్య తీవ్రతను బట్టి, ఏ స్థాయిలో పరిష్కారం కావాలో ఆ స్థాయిలోనే నిర్ణయం తీసుకునే విధంగా వ్యవస్థ పనిచేయాలని కోరారు.
గిరిజనుల అభివృద్ధి బాధ్యతను సమిష్టిగా స్వీకరిస్తూ ఐటీడీఏ, జిల్లా యంత్రాంగం, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించాలన్న దృక్పథం ప్రతి అధికారిలో, ప్రతి ప్రజా ప్రతినిధిలో ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
