ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. సంక్షేమ పథకాలే తమకి మరోసారి అధికారం కట్టబెడతాయని ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 11 స్థానాలకి పరిమితమైంది.
ఎన్నికల్లో ఎదురైన పరాభవం పై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదని భావోద్వేగానికి లోనయ్యారు.
‘ ఐదేళ్లుగా రాష్ట్రంలోని అక్క, చెల్లెమ్మలకు ఎంతో మంచి చేశాం. అవ్వ తాతలకు పెన్షన్లు ఇంటికి అందించాం. వారి ఓట్లన్నీ ఎటుపోయాయో తెలియడం లేదు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా ఉన్నాం. వారికి మంచి చేసినా ఓటమిపాలయ్యాం. రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాం. దాదాపు 54 లక్షల మందికి రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందించాం. గీత కార్మికులు, ఆటోడ్రైవర్లు, చిరు వ్యాపారులు, మత్స్యకారులు ఇలా అన్ని రకాల వారికి మేలు చేశాం. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. మేనిఫెస్టోలోని 99% హామీలను అమలు చేశాం. అన్ని రకాల సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చాం. అయినా ఇలాంటి తీర్పు ఎందుకు వచ్చిందనేది అర్థం కావడం లేదు. ప్రజల తీర్పుని గౌరవిస్తాం. మంచి చేయడానికి ఎప్పుడూ ముందుండే మేము.. ఇప్పుడు వారితోనే ఉంటాం. వారి తరఫున గళం విప్పుతాం. బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లకు శుభాకాంక్షలు. ఎన్ని చేసినా మాకు ఉన్న 40% ఓటు బ్యాంకును మాత్రం తగ్గించలేకపోయారు. వీటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతాం’ అని సీఎం అన్నారు.