దేశ చరిత్రలో పంజాబ్ రైతులు గొప్ప పోరాటం చేశారని.. వారి పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు, గాల్వాన్ లోయలో ప్రాణాలొదిలిన సైనికుల కుటుంబాలకు గతంలో ప్రకటించిన ఆర్ధికసాయానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. చండీఘడ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ లతో కలసి ఈ ఆర్ధికసాయం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్ రైతులు దేశం ఆకలి తీర్చారని.. సాగుచట్టాలు రద్దు చేసేవరకూ పోరాడి వ్యవసాయాన్ని కాపాడారని అన్నారు. రాష్ట్రానికి చెందిన భగత్ సింగ్ లాంటి వీరులు ఎందరో ప్రాణాలు అర్పించి సాధించిన స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్నా దేశం పరిస్థితి మారలేదని.. రైతుల సమస్యలకు పరిష్కారం లభించలేదని అన్నారు. సాగు చేసేందుకు విద్యుత్ మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం అంటోందని.. ఇదేంటని ప్రశ్నిస్తే దేశద్రోహులను ముద్ర వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.