CM Jagan:’జగనన్న విద్యా దీవెన’ నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి తిరువూరుకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. అయితే పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపించి ఇబ్రహీంపట్నం నుంచి ట్రాఫిక్ ను మళ్లించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. జగదల్పూర్ జాతీయ రహదారి రహదారిపై ఇబ్రహీంపట్నం నుంచి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వాహనాలను దారి మళ్ళిస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో జాతీయ రహదారి పై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
తిరువూరు బైపాస్ రోడ్ లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం పక్కనే ఉన్న ప్రదేశంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేశారు. తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా 10:35కు వాహిని ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 15 నిమిషాల్లోనే ప్రధాన రహదారి మీదుగా రోడ్డు మార్గం ద్వారా సభాస్థలికి చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి మధ్యాహ్నం 12:30 కు 10 నిమిషాల్లో హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. మొత్తం పర్యటనలో జాతీయ రహదారిపై ప్రయాణం అరగంటకు మించి లేదు. సీఎం వచ్చే సమయంలో లక్ష్మీపురం, ముత్తగూడెం చెక్ పోస్టు వద్ద కొద్దిసేపు వాహనాలు నిలిపితే సరిపోతుంది. కానీ అధికారులు అత్యుత్సాహంతో వాహనదారులను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మళ్లింపుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.