పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు పడ్డాయి. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఒక సాధారణ వ్యక్తి కోరికకు స్పందించిన సీఎం, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆయన ఇంటి నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒకసారి ప్రత్యక్షంగా కలవాలన్న కోరికను సత్యనారాయణ వ్యక్తం చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో స్పందించిన సీఎం, తాను సిద్ధాంతం పర్యటనకు వచ్చినప్పుడు కలుద్దామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారమే సత్యనారాయణను కలిసిన చంద్రబాబు, ఆయన అడగకుండానే పలు సహాయాలు అందిస్తామని ప్రకటించారు.
ఆ హామీల్లో భాగంగా తాజాగా సత్యనారాయణ ఇంటి నిర్మాణానికి అధికారులు పూజలు నిర్వహించి స్థలాన్ని మార్కింగ్ చేశారు. ఇంటి నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి అందజేస్తామని అధికారులు తెలిపారు.
సాధారణ ప్రజల సమస్యలు, కోరికలపై స్పందిస్తూ ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఒక సాధారణ వ్యక్తి ఆకాంక్షను గౌరవిస్తూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సత్యనారాయణ ఇంటి నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుట్టడంతో ఆయన కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

