తిరుపతి తొక్కిసలాట ఘటనలో విఫలమైన అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ని సస్పెండ్ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జెఈఓ గౌతమి, తిరుమల చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ( సీవీఎస్ఒ) లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొక్కిసలాట ఘటనలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఇంకెక్కడ జరగడానికి వీల్లేదన్నారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఈ ఘటన చాలా బాధిస్తోందని, ఇది అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. టీటీడీ చైర్మన్, ఈఓ, ఇతర మేనేజ్మెంట్ అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీయకుండా పనిచేయాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు.
మనస్సాక్షి ప్రకారం దేవుడి సేవ చేసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం.. 6 కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు బేసిక్ లో ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. తీవ్ర గాయాలైన వారికి రూ. 5 లక్షలు, స్వల్ప గాయాలైన 32 మందికి రెండేసి లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.