కడప జిల్లా గూడెం చెరువులో ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా కట్టడి చేసి ఖండించాలని అన్నారు. నాయకులు రెచ్చగొడితే కిందిస్థాయి నేతలు కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడతారని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ ఆందోళనలు జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వివేకా హత్యపై తప్పుడు ప్రచారం చేశారని, తనపై అబద్ధపు ఆరోపణలు చేసినట్టు చంద్రబాబు అన్నారు. అర్హులైన వితంతువులకు సాయం అందిస్తున్నామని, దేశంలోనే ఎక్కువ పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం మనదేనని గుర్తు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయని, 2028 డిసెంబర్ నాటికి మొదటి దశ పూర్తవుతుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ వల్ల జమ్మలమడుగు అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
గండికోటను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రూ.85 కోట్లతో పనులు ప్రారంభించామని, అక్కడ శ్రీకృష్ణదేవరాయ విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు. హంద్రీనీవా లైనింగ్ పనులు, చెరువుల మరమ్మతులు కొనసాగుతున్నాయని చెప్పారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చిన పార్టీ తమదేనని, రైతుల ఖాతాల్లో కేంద్రం-రాష్ట్రం కలిపి ఒక్కో రైతుకు రూ.20 వేలు జమ చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందని ప్రకటించారు.
సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నీటిని వాడుకుంటే కరవు ఉండదని అన్నారు. రోడ్ల కోసం ఇప్పటికే రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని, మిగతా రోడ్లనూ బాగు చేస్తామని హామీ ఇచ్చారు.
వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే వెళ్లి పింఛన్లు అందజేస్తున్నామని, జమ్మలమడుగు తమ పార్టీకి కంచుకోటగా మారుతుందని చంద్రబాబు నమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
