సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.
సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వివరించారు. ఘటనపై వచ్చిన ఆరోపణలు, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతి, తదుపరి చర్యలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెంటనే సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. అలాగే ఈ ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో ప్రత్యేక దర్యాప్తు నిర్వహించాలని నిర్ణయించారు.
సాయికృష్ణ అదృశ్యం కేసులో ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేసులో బాధ్యులెవ్వరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హ, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
