Cine Journalists:అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్ధం జరిగిన తర్వాత జ్యోతిష్కుడు వేణుస్వామి చేసిన వీడియో, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అన్నివైపుల నుంచీ వేణుస్వామి తీరుపై విమర్శలు వచ్చాయి. ఈక్రమంలో వేణు స్వామి పై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు పిర్యాదు చేశాయి. వారిద్దరి జాతకాలపై వ్యక్తిగత విశ్లేషణ చేసి ఇరు కుటుంబాల్లో ఆవేదనకు కారణమయ్యారని ఆరోపించారు.
గతంలో సినిమా, రాజకీయాలపై వ్యాఖ్యలు చేసి అభాసుపాలై.. మళ్లీ వీడియోలు చేశాడని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నీరెళ్ల శారదకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. విషయం పై స్పందించిన ఛైర్ పర్సన్ వేణుస్వామిపై, టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ చానల్స్ పైన తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసినవారిలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్షినారాయణ, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రేమమాలిని ఇతర సభ్యులు ఉన్నారు.