CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్ లు.. ఇలా క్రేజీ కాంబినేషన్లలో సినిమాలంటే మంచి క్రేజ్ ఉంటుంది. అయితే.. కొన్ని వర్కౌట్ కావు. వారి ఇమేజ్ మ్యాచ్ చేసే కథలు దొరకడం తేలిక్కాదు కాబట్టి. అలా తెలుగు ఇండస్ట్రీలో 29ఏళ్ల క్రితమే ఓ క్రేజీ కాంబినేషన్ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ అనే ఆలోచన పురుడు పోసుకుంది. అలా 1997లోనే ఆలోచించింది సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు. ఆ హీరోలు మెగాస్టార్ చిరంజీవి-విక్టరీ వెంకటేష్. తమ బ్యానర్లో 100వ సినిమాగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో సినిమా ఉంటుందని కూడా ప్రకటించారు.
దీంతో ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయిపోయింది. నాటి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊళ్లో మెగా-విక్టరీ ఫ్యాన్స్ మిత్రమండలి అంటూ బ్యానర్లు కూడా వెలిసిపోయాయి. త్వరలోనే సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, నాడు రామానాయుడు ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఎన్ని కథలు అనుకున్నా చిరంజీవి-వెంకటేశ్ ప్రైమ్ టైమ్ మ్యాచ్ చేసే కథ రూపుదిద్దుకోలేకపోయింది. దీంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అంతా ఆ విషయం మర్చిపోయి ఎవరి సినిమాలు వాళ్లు చేశారు. అభిమానులూ మిన్నుకుండిపోయారు. అయితే.. అటువంటి కాంబినేషన్లో భవిష్యత్తులో తప్పకుండా ఓ సినిమా వస్తుందని.. 28ఏళ్ళకి కల సాకారం అవుతుందని మాత్రం నాడు ఎవరూ ఊహించలేదు.
ఆ సినిమానే ‘మన శంకరవరప్రసాద్ గారు’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రేపు (జనవరి 12) భారీగా విడుదలవుతోంది. ఇందులో ఓ కీలక పాత్రలో వెంకటేష్ సందడి చేయబోతున్నారు. అయితే.. ఇది మల్టీస్టారర్ కాదు. క్యామియో రోల్. ఈపాత్రకు ఎవరైతే బాగుంటుందనే దర్శకుడి ఆలోచనకి చిరంజీవి రూపం ఇచ్చారు. వెంకటేశ్ అయితే సరిపోతారని చెప్పడం, ఆయన నటించడం, ట్రైలర్ లో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ అలరించడంతో రామానాయుడి కల, అభిమానుల ఆశలు ఎట్టకేలకు నిజమయ్యాయని చెప్పాలి. ఇప్పుడు అందరి చూపులు సినిమాపైనే. ఇప్పటికే వీరిద్దరి పాట, సన్నివేశాలతో అంచనాలు పెరిగిపోయాయి. ఇంకొన్ని గంటల్లో వీరిద్దరి సందడి మొదలవబోతోంది. ఆల్ ది బెస్ట్ ‘మన శంకరవరప్రసాద్ గారు’.
