ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ‘సినీ పెద్దగా కాదు.. బిడ్డగానే ఇక్కడికి వచ్చా. సినిమా అందరికి అందుబాటులో ఉండాలన్న సీఎం ఆలోచన నాకు నచ్చింది. ఎగ్జిబిటర్లు ఇబ్బందులు పడుతున్న అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాను. రెండువైపులా అంశాలను తెలుసుకోవాలని సీఎం జగన్ అన్నారు’.
‘కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమ లో కార్మికులు దయనీయ పరిస్థితి లో గడిపారని చెప్పగా.. పరిశ్రమ సాధక బాధలను తెలుసుకున్నట్టు చెప్పారు. సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నామని చెప్పారు. ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుని జీవో ఇస్తామని సీఎం చెప్పారు. ఐదో షో ఉండాలా లేదా అన్న విషయంపై కూడా ఆలోచిస్తున్నామన్నారు. పరిశ్రమలోని వ్యక్తులెవరూ లేని పోనీ కామెంట్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’.
‘పెద్ద సినిమానా, చిన్న సినిమానా అనే భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా. రెండు మూడు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే కమిటీ సమావేశానికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తాం’ అని అన్నారు.