Chiranjeevi: ఓ సినిమా హిట్టయితే టీమ్ కి ఆనందం. నటీనటులకు సంతోషం. బయ్యర్లకు సంబరం. కానీ, ఓ సినిమా హిట్టయితే వీటన్నింటితోపాటు ఆ సినిమా హీరో అభిమానులకు పండగ.. ఎనలేని ఉత్సాహం. ఆనందభాష్పాలతో తమ జీవితంలో సంతోషకరమైన సంఘటన జరిగినట్టే జాతర చేస్తారు. ఆ హీరో మెగాస్టార్ చిరంజీవి. అభిమానులు మెగాభిమానులు. ‘సినిమా’ మాధ్యమం చిరంజీవిని ఫ్యాన్స్ గుండెల్లో అంతగా మమేకం చేసింది. దశాబ్దాలుగా చిరంజీవిపై అభిమానం.. ఆయన సినిమాపై ఆదరణే ఇందుకు ఉదాహరణ. ఇటివల వీరి ఆనందాన్ని స్కైహైలో నిలబెట్టిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. మూడు రోజులకే సినిమా అయిపోతున్న నేటి రోజుల్లో దిగ్విజయంగా 95 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంటోంది.
సంక్రాంతికి వచ్చిన సినిమా తెలుగు సినిమా రీజనల్ కేటగిరీ ఇప్పట్లో మరెవరైనా అందుకుంటారా అనేంతగా రికార్డుల్ని సృష్టించింది. పాన్ ఇండియా సినిమాలు తెలుగు లాంగ్వేజ్ లో క్రియేట్ చేయలేని రికార్డుల్ని ‘మన శంకరవరప్రసాద్ గారు’ క్రియేట్ చేసింది. దాదాపు 400కోట్ల గ్రాస్, 200కోట్లకు పైగా షేర్ తో కనివినీ ఎరుగని స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసింది. ఓటీటీలోకి సినిమా వచ్చినా, ఫిబ్రవరి 28న జీ5లో ప్రసారమైనా కూడా ధియేటర్లలో సందడి చేస్తోంది. మినిమం కలెక్షన్లతో రన్ అవుతోంది. 12న సినిమా విడుదల కాగా.. 11న రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ నుంచే అభిమానుల నుంచి ‘బ్లాక్ బస్టర్ బాస్ బ్లాక్ బస్టర’ని ఒకటే హోరు. రాష్ట్రందాటి ఓవర్సీస్ వరకూ ఇదే మాట. అభిమానుల నుంచి రివ్యూవర్స్ వరకూ ఇదే మాట. ఎక్కడా టాక్ తేడా పడలేదు.
ఒపెనింగ్ షో నుంచే మహిళా ప్రేక్షకులు, పిల్లలు టోటల్ ఆడియన్స్ సంబరాలే జరిగాయి. 20ఏళ్ల క్రితం చిరంజీవి ఎనర్జీ ఎలా ఉండేదో పూర్తిగా మళ్లీ ఆవిష్కరించిన సినిమాగా హోరెత్తింది. చిరంజీవి లుక్స్, డ్యాన్స్, ఫైట్స్, స్వాగ్.. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, చిన్నారులతో సెంటిమెంట్ అన్నీ ఒకటికి మించి మరొకటి ధియేటర్లో ప్రేక్షకులతో కితకితలు పెట్టించాయి. చిన్నాపెద్దా అంతా ధియేటర్లకు కదిలారు. సంక్రాంతి పండగను ఇంట్లో, ఆనందాన్ని ధియేటర్లో చిరంజీవితో చేసుకున్నారు. ఎక్కడ చూసినా టికెట్లు 30,50, 150 గంపగుత్తగా తెగాయి. సోషల్ మీడియాలేని రోజుల్లో చిరంజీవి సినిమా జాతరేంటో తమ ఇళ్లలో పెద్దవాళ్లు చిరంజీవి సినిమా గురించి చెప్పగా విన్నవారంతా ఈ జనరేషన్ చిరంజీవి సినిమా మ్యాజిక్ ఏంటో చూశారు. అభిమానులూ ధియేటర్లో 50రోజుల సంబరాన్ని సందడిగా చేసుకుంటున్నారు.
