Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో లేరు. కానీ, ఆయన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు కొందరు. నేరుగా రాజకీయ కోణంలో కాదు, ‘కుల’ మీడియా సంస్థల్ని అడ్డం పెట్టుకుని చిరంజీవిని ఇరకాటంలో పడేయాలని ప్రయత్నిస్తున్నారు.
చిత్రమేంటంటే, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు చిరంజీవిని ఏకకాలంలో టార్గెట్ చేస్తున్నాయి. ఒకటేమో వైసీపీ, ఇంకొకటేమో టీడీపీ. వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా.. ఈ విషయంలో ఒక్కతాటిపై నడుస్తున్నాయి.
ఓ క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన కార్యక్రమంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి, చిరంజీవిని క్యాన్సర్ బాధితుడిగా చూపించింది ఓ సెక్షన్ మీడియా. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ముందు కథ చాలానే వుంది.
పవన్ కళ్యాణ్ మీద ఎటూ, ప్రధాన మీడియాలోని ఓ సెక్షన్ స్పెషల్ ఫోకస్ పెట్టి, ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తూనే వుంటుందనుకోండి.. అది వేరే సంగతి. చిరంజీవిని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు.?
చిరంజీవి అభిమానుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు.. చిరంజీవి అభిమానులకీ పవన్ కళ్యాణ్ అభిమానులకీ అస్సలు పొసగదు.. అసలంటూ అన్నదమ్ములిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు.. ఈ తరహా ప్రచారాల్ని సోకాల్డ్ మీడియా ఇప్పటికీ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.
ఒకప్పుడు చిరంజీవి రాజకీయాల్లో వున్నా, ఇప్పుడాయన రాజకీయాల వైపు చూడటంలేదు. కానీ, చిరంజీవికి వున్న ‘అందరివాడు’ అనే ఇమేజ్ చెడగొట్టే పైశాచికత్వం ఓ సెక్షన్ మీడియా చేస్తూనే వుంది. రాజకీయంగా చిరంజీవి ఏదన్నా పార్టీకి మద్దతిస్తారన్న భయమా.? ఇంకోటేదన్నా బలమైన కారణం వుందా.?