Chiranjeevi: సినిమాల్లో హీరోగా రాణించాలన్నా.. ప్రేక్షకుల్లోకి ఓ హీరో చొచ్చుకుపోవాలన్నా మాస్ ఇమేజ్ తప్పనిసరి. ఇందుకు హీరోలు ఎంతగానో ప్రయత్నిస్తూంటారు. సాఫ్ట్ లుక్ గా కనిపించినా సరే.. మాస్ పాత్రలు మెప్పించాలని చూస్తారు. కారణం.. ఆ ఇమేజ్ వారికి చాలా పెద్ద మైలేజీ ఇస్తుంది కాబట్టి. దీనిని చాలా త్వరగా ఒడిసిపట్టారు చిరంజీవి. కెరీర్ తొలినాళ్లలో విలన్ పాత్రలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. ఆయన ముఖంలో పలికే భావాలు మాస్ హీరోని తలపించాయి. దీంతో రౌద్రం, ఆవేశం, మాస్ కలగలిపిన పాత్రలతో తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఏలేశారు. ఈక్రమంలో ఎన్నో మేనరిజమ్స్ తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుని.. చిన్నారులను సాధారణ ప్రేక్షకుల్ని అలరించారు. అవి ఎంత పాపులర్ అంటే.. దశాబ్దాలైనా అవి ఇంకా ప్రేక్షకుల మది నుంచి పోలేదు.. పైగా ఎవర్ గ్రీన్ గా నిలిచాయి.
కొండవీటి రాజా.. దెబ్బక్కాయ్, జగదేకవీరుడు అతిలోక సుందరి.. కూసాలు కదిలిపోతాయ్, గ్యాంగ్ లీడర్.. రఫ్పాడించేస్తా, రౌడీ అల్లుడు.. బాక్స్ బద్దలైపోద్ది, ఘరానా మొగుడు.. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, ముఠామేస్త్రి.. స్టోరీ మారిపోద్ది, అల్లుడా మజాకా.. టాప్ లేచిపోద్ది, హిట్లర్.. అంతొద్దు ఇది చాలు, ఠాగూర్.. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకేఒక పదం.. ఇవన్నీ తెలుగు సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. అభిమానులే కాదు.. ప్రజల్లో కూడా కొన్ని సాధారణ మాటల్లా పలికాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో వీటిని ఆయా సందర్భాల్లో ఉపయోగిస్తారు. అంతగా చిరంజీవి మేనరిజమ్స్ ప్రభావం చూపాయి. ముఖ్యంగా రఫ్పాడించేస్తా, బాక్స్ బద్దలైపోద్ది, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, స్టోరీ మారిపోద్ది, అంతొద్దు ఇది చాలు, తెలుగు భాషలో నాకు నచ్చనిది.. చాలా పాపులర్.
కొన్ని డైలాగులు హీరోలు పలికినా సినిమాతోనే ఆగిపోతాయి. కొన్ని దశాబ్దాలుగా ప్రజల్లో ఉండిపోతాయి. ఇందుకు హీరో చరిష్మా వాటిని పలికే తీరు, హావభావాలు, ఇమేజ్ ముఖ్యం. చిరంజీవి పలికే డైలాగులు వాటిని అభినయిస్తూ చెప్పే స్టయిల్ ఎంతో ఆకట్టుకునేవి. చిరంజీవి నోట కొత్తగా ఏ డైలాగ్ వస్తుందోనని ఎదురుచూసే ప్రక్షకులు ఉన్నారు. తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి పలికినన్ని మాస్ మేనరిజమ్స్ మరే హీరోకూ లేవు. ఇందుకు ఆయన మాస్ ఇమేజ్ కూడా తోడైంది. రఫ్ గెడ్డం, తీక్షణమైన చూపు, మాస్ స్టయిల్ తో సన్నివేశాన్ని ఓ స్థాయికి తీసుకెళ్లడం చిరంజీవి స్పెషల్. చిరంజీవి అభిమానులు మాత్రమే కాదు.. అశేష జనవాహిని సరదాగా పలికే విధంగా ఆ మేనరిజమ్స్ ఉండటంతో మరింత సక్సెస్ అయ్యాయి.
