Chiranjeevi: బ్రహ్మానందం ప్రధాన పాత్రధారిగా 1992లో వచ్చిన ‘మనీ’ సినిమాలో ఆయనతో తనికెళ్ల భరణి ఓ మాట చెప్తాడు. ‘ముందు చిన్న వేషాలు.. తర్వాత విలన్ పాత్రలు, అటుపై క్యారెక్టర్ పాత్రలు.. తర్వాత హీరో వేషాలు వేయాలి. చిరంజీవి టైపు. లేదంటే.. ఒకే సినిమాతో హీరో అయిపోవాలి’ అంటాడు. నీకేది కావాలని అంటే.. ‘రెండోదే బెటరేమో అంటాడు’ బ్రహ్మానందం. అప్పుడూ.. ఇప్పుడైనా హీరో కావాలంటే చాలా హర్డిల్స్ దాటాలి. కాస్త కష్టపడితే హీరో కావడం ఇప్పుడు తేలిక. తాము నిరూపించుకోవడానికి అనేక వేదికలు ఉన్నాయి కాబట్టి. నాడు.. ఎంతో ప్రయత్నం, దర్శక-నిర్మాతలను ఒప్పించాలి, కష్టపడాలి, ఓపిక ఉండాలి, వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుని ఒక్కో మెట్టే ఎక్కాలి. దీనిని చిరంజీవి తూ.చ తప్పకుండా పాటించి, అగ్ర స్థానంలో నిలిచి, తెలుగు సినిమా రారాజుగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధులుగా కోర్సు పూర్తి చేశాక అవకాశాలు వచ్చాయి. వారిలో చిరంజీవీ ఉన్నారు. తొలిగా పునాదిరాళ్లులో ఐదుగురు హీరోల్లో ఒకరిగా అవకాశం వచ్చింది. కానీ.. మొదటగా విడుదలైన ప్రాణం ఖరీదులోనూ హీరో పాత్రే. ఆ తర్వాత వచ్చిన అవకాశాలు చిరంజీవికి పూలపాన్పు కాలేదు. విలన్ వేషాలు పలకరించాయి.. సినిమా క్లైమాక్స్ లో రెండు నిముషాల విలన్ పాత్ర, కొన్ని సినిమాల్లో అతిధిపాత్రలు.. హీరోయిన్ ను ఏడిపించే పాత్రలు.. ఇలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు చిరంజీవి. ఓదశలో హీరో కృష్ణ సినిమాలో చిన్న పాత్రకు అడిగితే ‘హీరో వేషాలు వేస్తున్నానండీ..’ అంటే అప్పుడే హీరో అంటున్నావ్.. చేయవయ్యా పెద్ద హీరో అక్కడ అన్నవాళ్లకు ఎదురు చెప్పలేక చేసానని చిరంజీవే స్వయంగా చెప్పుకొచ్చారు ఓ సందర్భంలో.
ఓ సందర్భంలో కృష్ణంరాజు సైతం చిరంజీవి మంచి విలన్ అవుతాడని మురళీమోహన్ తో అన్నారు. నాడు అటువంటి పాత్రల్లో చిరంజీవిని క్రూరమైన విలన్ గానే చూపారు. సినిమాల్లో హీరోయిన్లను ఏడిపించే విలన్ పాత్రల్లో నటించేవారికి హీరోలుగా అవకాశాలు రావడం గొప్ప విషయమే. సినిమాని మహిళా ప్రేక్షకులు ఆరోజుల్లో తీసుకునే తీరే వేరు. విలన్లను బయట తిట్టినవారు.. ఉత్తరాల్లో తిట్టిన వారు ఎందరో. వారికి హీరోగా అవకాశాలు కొంత కష్టమే. కానీ.. చిరంజీవి తన నటనతో ఒదిగిపోయారు. తనలోని నటనా సామర్ధ్యాన్ని అక్కడితోనే ఆగనివ్వక టాలెంట్ చూపించారు. హీరోగా.. డ్యాన్సులు, ఫైట్లలో వైవిధ్యం చూపించి విలన్ నుంచి హీరోగా ఎదిగి తిరుగులేని కథానాయకుడు అయ్యారు.