చిరంజీవి కెరీర్ ప్రారంభంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే క్రమంలో అనేక సినిమాల్లో విలన్ పాత్రలు, అతిధి పాత్రలు కూడా చేశారు. ఈ క్రమంలోనే వర్ధమాన నటుడిగా హీరో అవకాశాలనూ అందుకున్నారు. ఈక్రమంలో చేసినవే శ్రీరామబంటు, అగ్ని సంస్కారం, ఆరని మంటలు. ఈ మూడు సినిమాల్లో చిరంజీవి భిన్నమైన పాత్రలే పోషించారు. అగ్ని సంస్కారం సినిమాలో సమకాలీన సమాజంపై తెరకెక్కిన సినిమాగా చెప్పాలి. చదువుకున్న యువకుడు తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించే పాత్రలో చిరంజీవి నటించారు. సినిమాలో ఆయన పాత్ర అప్పటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కడంతో పరిస్థితులపై పోరాడిన పాత్రలో చిరంజీవి నటించి మెప్పించారు.
శ్రీరామబంటు..
ఈ సినిమా చిరంజీవి నటించిన తొలి మైథలాజికల్ సినిమాగా చెప్పాలి. భగవంతుడు, భక్తుడికి మధ్య జరిగే కథ. సినిమాలో చిరంజీవి హీరోగా నటించారు. గ్రామానికి వచ్చిన ఇంజనీర్ గా అక్కడే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే పాత్ర. మధ్యలో ఊళ్లో అరాచకాలను ఎండగట్టి హీరోయిన్ సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా నటించారు. ఇదే సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమాగా శ్రీరామ బంటును చెప్పొచ్చు. ఇద్దరి మధ్య వచ్చే ఫైట్లు, కొన్ని సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయి. ఆంజనేయ భక్తుడైన చిరంజీవి.. అదే హనుమయ్య ఈ సినిమా కథలో మూల పాత్రధారి. చిరంజీవి హీరోయిజం లేకపోయినా.. చిరంజీవిని హీరోగా చూపిన సినిమా శ్రీరామ బంటు.
ఆరని మంటలు..
ఈ సినిమా రివేంజ్ డ్రామా. చిరంజీవి చాలా ఫెరోషియస్ గా కనిపిస్తారు. సిస్టర్ సెంటిమెంట్ ఉన్న సినిమా. కెరీర్ తొలినాళ్లలో సినిమానే అయినా చిరంజీవి మేకోవర్, వీరోచితమైన నటన, రౌద్రం కొత్తగా అనిపిస్తాయి. అప్పటివరకూ ఉన్న మూసధోరణికి భిన్నంగా చిరంజీవి లుక్, రివేంజ్ తాలూకు ఎక్స్ ప్రెషన్స్ ఈ సినిమాలో చూడొచ్చు. అప్పటికి చేసిన సినిమాలు తక్కువ.. అయినా మాస్ లుక్ ఆకట్టుకుంటుంది. చెల్లెలిని మోసం చేసిన వారిపై పగ తీర్చుకునే పాత్రలో నటించారు. చెల్లెలి మృతికి కారణమైన నలుగురినీ ఒక్కో రకంగా హతమార్చి ప్రతీకారం తీర్చుకునే పాత్ర. నిప్పుకణికల్లాంటి చిరంజీవి కళ్లు, ఆవేశం, రౌద్రం, నటన ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయి.