Chiranjeevi Birthday Special: తెలుగు ఇండస్ట్రీలో హీరోలను ఎక్కువగా ‘బాబు’ అనే పిలుస్తారు. కృష్ణవంశీ ‘ఖడ్గం’లో దీనిని సెటైరికల్ గా కూడా చూపారు. మరికొందరు హీరోలను ‘హీరో’తో పిలుస్తారు. అయితే.. వీరందరికీ అతీతంగా మెగాస్టార్ చిరంజీవిని మాత్రమే ‘చిరంజీవిగారు’ అని సంబోధిస్తారు. అశ్వనీదత్ ‘బాస్’.. రాఘవేంద్రరావు ‘బాబాయ్’ అని పిలిచినా అది వారి మధ్య అనుబంధానికి సంకేతం. అభిమానులు ‘అన్నయ్యా’ అని పిలుచుకున్నా వ్యక్తిగతంగా మాట్లాడే సమయంలో ‘చిరంజీవిగారు’ అనే పలకడం చిరంజీవికి మాత్రమే దక్కిన గౌరవం. వేరే ఇండస్ట్రీవారు కొందరు చిరంజీవి సర్ అని పిలిచినా ఎక్కువగా ‘చిరంజీవిగారు’ అనే పలుకుతారు. పరిశ్రమలో అయినా.. అభిమానుల్లో అయినా ‘చిరంజీవిగారు’ సాధించిన గౌరవం ఇది.
కారణం.. స్వయంకృషితో ఒక్కడిగా వచ్చి చిరంజీవి సాధించిన ఘనతకు ‘గారు’ అని ఇండస్ట్రీ, ఫ్యాన్స్ ఇచ్చుకుంటున్న గౌరవం. వరుణ్ తేజ్ తొలి సినిమా డైరక్టర్ ‘శ్రీకాంత్ అడ్డాల’ అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్న రోజుల్లో యూనిట్ లో ఓ సందర్భంలో చిరంజీవి అన్నారట. అక్కడున్న వారే ‘చిరంజీవిగారు’ అనాలి.. అని చెప్పారని స్వయంగా ఓ వేదికపై చెప్పారు. నేను పరిశ్రమ పెద్దను కానని చిరంజీవి అన్నా కూడా ఆయన్నే పరిశ్రమ పెద్ద దిక్కుగా చూస్తోంది. ఇంతటి గౌరవానికి కారణం.. ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంగా ఏలడం మాత్రమే కాదు, తన తొలిమెట్టుని మరువకపోవడం, సాటివారిని గౌరవించడం, పరులకు సాయపడటం, ఆయన వ్యక్తిత్వం. అందుకే, చిరంజీవి అంటే పరిశ్రమకు గౌరవం.. అభిమానులకు భక్తి. అందుకే చిరంజీవి బాబు కాదు.. ‘చిరంజీవిగారు’.
చిరంజీవి సినిమా విడుదలవుతుంటే గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకుని మరీ ఓపెనింగ్ షోకి వెళ్లే అభిమానులు ఉన్నారు. స్వతహాగా ఆంజనేయుడి భక్తుడైన చిరంజీవిని చూసి ఆంజనేయమాల వేసుకునే అభిమానులు ఉన్నారు. దాదాపు ప్రతి ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకునే చిరంజీవిని చూసి అయ్యప్ప దీక్ష తీసుకునే అభిమానులూ ఉన్నారు. ‘మాస్టర్’ సినిమాలో.. ‘నా వెనుకున్న జనం డబ్బుతో రాలేదు.. ప్రేమతో వచ్చారు, అభిమానంతో వచ్చార’నే డైలాగ్ ఇక్కడ అక్షర సత్యం. హీరో అభిమానులపై సమాజంలో ఉన్న చూపుని సమూలంగా మార్చి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్ది ఓ గౌరవం తీసుకొచ్చారు చిరంజీవి. అందుకే చిరంజీవి అంటే అభిమానులకు అంత గౌరవం, భక్తి. అందుకే ఆయన ‘చిరంజీవిగారు’.
