Chiranjeevi Birthday Special: తనకంటూ ఏమీలేని ఓ రంగంలోకి తానుగా ఎంచుకుని ఒక్కడిగా వచ్చి ఎదగడం వేరు.. అదే రంగాన్ని శాసించడం.. ఓ సామ్రాజ్యాన్నే సృష్టించుకుని తన పేరుని ఘనంగా లిఖించుకోవడం వేరు. నటుడిగా వచ్చి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ప్రస్థానం ఇదే. కాకలుతీరిన యోధులు ఉన్న సినీ పరిశ్రమలో తనకో మార్గం ఏర్పరుచుకుని తిరుగులేని స్టార్ హీరో అయ్యారు చిరంజీవి. ఇది అందరికీ తెలిసిందే. అయితే.. తాను ఎదగడంతోపాటు తన కుటుంబాన్నీ ఓ స్థానంలో కూర్చోబెట్టి తోడబుట్టిన వారిని, కన్నబిడ్డలను, తోబుట్టువుల బిడ్డలకు కూడా ఓ దారి వేయడం చిరంజీవి ప్రత్యేకతను చూపుతుంది. ఇంతపెద్ద పరిశ్రమలో తన కుటుంబం కూడా స్థిరపడాలనే ఆయన ఆలోచన అద్భుతం.
80ల్లో తమ్ముడు నాగబాబు, 90ల్లో మరో తమ్ముడు పవన్ కల్యాణ్, 2Kలో తనయుడు రామ్ చరణ్, 2010ల్లో తోబుట్టువుల బిడ్డలు వరుణ్ తేజ్, నిహారిక, సాయితేజ్, 2020ల్లో వైష్ణవ్ తేజ్, నిర్మాతగా తనయ సుస్మిత కొణిదెల.. ఇలా తన కుటుంబం నుంచి సినీ పరిశ్రమకు మెజారిటీ ఆదాయం వచ్చేంతగా వారికో మార్గం వేశారు. వీరిలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తిరుగులేని స్టార్లుగా ఎదిగి చిరంజీవి పేరును ఘనంగా చాటగా మిగిలినవారు రాణిస్తున్నారు. దేశంలో ఇంతగా సినీ పరిశ్రమలో రాణించడం హిందీలో కపూర్ కుటుంబం తర్వాత చిరంజీవి కుటుంబానిదే స్థానం. చెల్లెళ్ల కోసం సినిమాలు చేసి లాభాలు పంచి వారిని స్థిరపరిచారు. తనతోపాటు తన కుటుంబం కూడా ఎదగాలనేలా చిరంజీవి చేసిన ఆలోచన ఎవరికైనా అనుసరణీయం.
చిరంజీవికి కుటుంబాన్ని కలిపి ఉంచడం ఎంతో ఇష్టం. ప్రతి సంక్రాంతికి బెంగళూరులోని ఫామ్ హౌస్ లో అందరూ కలిసి పండగ చేసుకుంటారు. చిరంజీవి ప్రైమ్ టైమ్ లో కూడా ప్రతి ఆదివారం పిల్లలందరితో కలిసి ఆడుకోవడం అంతా కలిసి భోజనం చేయడం.. అందరి క్షేమం కాంక్షించడం చిరంజీవికి అలవాటు. మానసికంగా ఆయన బలం కుటుంబం. రాఖీ కట్టిన చెల్లెళ్లకు ఇన్నేళ్ల తర్వాత కూడా ఆస్తులు పంచి తోబుట్టువుల బంధాన్ని చాటారు. కుటుంబ విలువలు పాటించి భవిష్యత్ తరాలకు అందించాలనేది చిరంజీవి సిద్ధాంతం. తమ్ముడు పవన్ కల్యాణ్ ఎన్నికల్లో గెలిచి చిరంజీవి ఇంటికొచ్చి ఆయన పాదాలనుతాకి ఆశీర్వాదం తీసుకోవడం అన్నాదమ్ముల ప్రేమను తెలియజేసింది. మెగా ఫ్యామిలీగా ప్రేక్షకుల్ని అలరించడమే కాదు.. వ్యక్తిగా కుటుంబాలు కలిసుండాలనే విషయాన్ని ప్రజలకు చాటి చెప్పారు చిరంజీవి.
