Chiranjeevi: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్. ఫిబ్రవరి 14న విడుదలవబోతున్న సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..
‘విశ్వక్ సేన్ ఫంక్షన్ కి వెళ్తున్నావా అనడిగారు. ఎందుకు వెళ్ళకూడదని నేనంటే.. అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ.. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులంటే వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా? అనిపించింది. విశ్వక్ కి ఇదే ప్రశ్న ఎదురైతే.. చక్కని సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదని చెప్పినందుకు అభినందిస్తున్నాను. ఎన్టీఆర్, ఏఎన్నార్ లను అభిమానించే మా కజిన్స్ కొట్టుకునేవారు. ఆ రోజు నుంచే నాకు మొదలైయింది. నేను నటుడయ్యాక హీరోల మధ్య సఖ్యత, సహృధ్భావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నాను. ఈరోజుకి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మేమంతా కలసికట్టుగా వుంటాం.
పుష్ప – పెద్ద హిట్టయింది. దానికి నేను గర్విస్తాను. ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడిందంటే అందరం ఆనందం పడాలి. ఆ ఆనందం ఇవ్వడానికి నేను వచ్చాను. సినిమా ట్రైలర్ చూసాక ఎక్కడో అనగారిపోయిన కోరిక గబుక్కున పెళ్ళుబికింది. లైలా గెటప్ లో విశ్వక్ కసక్ లా అనిపిస్తున్నాడు(నవ్వుతూ). అంత గ్లామర్ గా వున్నాడు. నేను, నరేష్, రాజేంద్ర ప్రసాద్ లేడి గెటప్స్ వేశాం. ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. లైలా కూడా హిట్ గ్యారెంటీ. ప్రేక్షకులు తప్పకుండా సినిమా ఎంజాయ్ చేస్తారు. విశ్వక్ మాస్ క్లాస్ ఇటు అమ్మాయిగా అద్భుతంగా చేశాడు. దర్శకుడు రామ్ చాలా ఎంటర్ టైన్మెంట్ తో తీశాడు. విశ్వక్ చాలా ప్రతిభావంతుడు.. ఇప్పటికే నిరూపించుకున్నాడు. తను ఇండస్ట్రీలో జెండా పాతాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
విశ్వక్సేన్ మాట్లాడుతూ.. ‘చిరంజీవిగారు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆయన కళ్ళలో ఒక ఆర్టిస్ట్ ఆనందం చూశాను. అది నాకు ఫస్ట్ అవార్డ్, రివార్డ్. మా నాన్న చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్. నా సినిమాకి చిరంజీవిగారు సపోర్ట్ చేయడానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కథ నావరకూ తీసుకొచ్చింది సాహుగారు. ఇది నా కెరీర్ లో స్పెషల్ మూవీ. రామ్ కథ చెప్పినప్పుడు నవ్వించాడు. నేను జనాల్ని నవ్వించాలని డిసైడ్ అయ్యాను. అన్నదానం ఎంత గొప్పదో మంచి వినోదం వున్న సినిమా తీయడం కూడా అంత గొప్పది. అదే ప్రయత్నం మేము లైలాతో చేశాం. ఫెబ్రవరి 14న అందరూ థియేటర్స్ కి వచ్చేయండి. సరదాగా ఎంజాయ్ చేయండ’ని అన్నారు.
నిర్మాత సాహు గారపాటి.. ‘పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవిగారు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి రావడం చాలా బలాన్ని ఇచ్చింది. చిరంజీవిగారు మా ఈవెంట్ కి వచ్చారు కాబట్టి ఇకపై మా ప్రమోషన్స్ కనిపిస్తాయి. విశ్వక్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ క్యారెక్టర్ చేయడానికి ఎవరూ ముందుకు రారు. చాలా అద్భుతంగా చేశాడు. తన మ్యాజిక్ బిగ్ స్క్రీన్ పై ఆడియన్స్ చూస్తారు. ఆడియన్స్ తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేస్తార’నిఅన్నారు.
దర్శకుడు రామ్ నారాయణ.. ‘నాకు సినిమా తెలిసింది చిరంజీవిగారి వలనే. ఆయన్ని ప్రత్యేక్షంగా చూడటం అదృష్టంగా భావిస్తున్నాను. విశ్వక్ కథ ఒప్పుకోవడమే నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. సినిమా అవకాశం ఇచ్చిన సాహు గారికి, అర్చన గారికి థాంక్ యూ’ అన్నారు. కార్యక్రమంలో నటీనటులతోపాటు టెక్నీషియన్స్ అందరూ పాల్గొన్నారు.