స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ వేదికగా జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేనని స్పష్టం చేస్తూ, ఆయన విజన్‌ను అమలు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల నేపథ్యంలో జ్యూరిక్‌కు వచ్చిన లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రసంగించారు. యూరప్‌లోని సుమారు 20 దేశాల నుంచి వచ్చిన తెలుగువారి ఉత్సాహాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు.
తెలుగువారు ఎక్కడ ఉన్నా తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారని ప్రశంసించిన లోకేష్, విదేశాల్లో ఉన్న తెలుగు సమాజం రాష్ట్రాభివృద్ధికి కీలక భాగస్వాములని పేర్కొన్నారు. గత ఏడాది ఇదే వేదికపై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానం ప్రారంభమైందని, అక్కడినుంచే పెట్టుబడుల వెల్లువ మొదలైందని గుర్తుచేశారు. గత 18 నెలల్లో రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని, వాటితో 16 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రావడం రాష్ట్రంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటిచెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన వేసిన బాటలోనే చంద్రబాబు నాయుడు అభివృద్ధి రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చారని లోకేష్ చెప్పారు. ఐటీ నుంచి క్వాంటమ్ టెక్నాలజీ వరకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దూరదృష్టి చంద్రబాబుకే ఉందన్నారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు ఏపీకి రావడానికి కారణం ఒక్కటే – “బ్రాండ్ సీబీఎన్” అని స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడిని చూసి బ్లైండ్‌గా ఫాలో కావాలని వ్యాఖ్యానించిన లోకేష్, ఆయన ముందుచూపుపై నమ్మకంతోనే పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని తెలిపారు. విమర్శలు ఎదురైనా భోగాపురం ఎయిర్‌పోర్టు, అమరావతి అభివృద్ధి, హైటెక్ సిటీ వంటి ఎన్నో ప్రాజెక్టులు ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దని ప్రయత్నించే శక్తులు ఉన్నా, వాటిని అధిగమించి ఏపీని ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ఏపీ భవిష్యత్తును నిర్మిస్తున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ, రైల్వే జోన్, అమరావతి పునర్నిర్మాణం, పోలవరం పనుల వేగవంతం వంటి కీలక అంశాల్లో పురోగతి కనిపిస్తోందన్నారు.
అభివృద్ధి, సంక్షేమం రెండూ ఒకే రథచక్రాల్లా ముందుకు సాగుతున్నాయని, రోడ్లు, మౌలిక వసతులు, విద్యుత్ చార్జీల తగ్గింపు, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం ఫలితాలు చూపుతోందన్నారు. ఒకే రాజధాని అమరావతి, వికేంద్రీకృత అభివృద్ధే ప్రభుత్వ విధానమని స్పష్టం చేస్తూ, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్న లోకేష్, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడంలో వారి పాత్ర కీలకమన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏపీఎన్ఆర్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్క్ పెంచాలని కోరారు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్, మంత్రి టీజీ భరత్, ఏపీఎన్ఆర్టీ చైర్మన్ డాక్టర్ వేమూరు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
