‘ఒక సైకో చేతిలో రాష్ట్రం నాశనమైపోతోంది.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఆ సైకో ఊరికో సైకోని తయారు చేస్తున్నాడు. వైసీపీ సైకోలను భూస్థాపితం చేసే వరకూ పోరాడుతా’ అని చంద్రబాబునాయుడు అన్నారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఆయన మాట్లాడారు.
‘వైసీపీ పాలనలో ఊరికో సైకోని తయారు చేస్తున్నారు. వాళ్ల ధాటికి తట్టుకోలేక పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్లిపోతున్నాయి. ఏపీకి చెందిన అమరరాజా బ్యాటరీస్ రూ.9,500 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి ప్రభుత్వంలో ఒప్పందం చేసుకుంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా..? గత సీఎంలు అమరరాజా పరిశ్రమను ప్రోత్సహిస్తే జగన్ వేధిస్తున్నారు’.
‘ఇలా అయితే ఏపీ యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..? రాజకీయ కక్షతో నారాయణ విద్యాసంస్థల అధినేతనూ వేధిస్తున్నారు. పోలవరం పూర్తి చేయాలని తపించా. కానీ.. జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు’ అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నుంచి నిడదవోలు వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.