‘వైఎస్ జగన్ 2004లో సీఎం అయ్యుంటే నాపై కక్షతో ఇప్పటి అమరావతిలా టీడీపీ హయాంలో నిర్మించిన హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, ఐఎస్ బీలను కూల్చేసేవారేమో.. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్టును ఆపేసేవారేమో’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని రామవరప్పాడుకు చెందిన బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..
‘నేను విజన్ తో అభివృద్ధి చేయడం వల్లే హైదరాబాద్ ఈరోజు అభివృద్ధికి చిరునామాగా ఉంది. అమరావతిని కూడా అలానే అభివృద్ధి చేయాలని భావించాను. కానీ.. అమరావతిని జగన్ స్మశానం చేయాలని చూస్తున్నారు. ఎలుకలు మద్యం తాగడం, ఉడతలు వల్ల కరెంట్ తీగలు తెగిపోవడం, ఉద్యోగుల ఖాతాల్లోని సొమ్ము మాయమైపోవడం.. వైసీపీ ప్రభుత్వంలోనే సాధ్యం. తెలంగాణలో పది ఉత్తీర్ణత 90శాతం ఉంటే.. ఏపీలో 67శాతం నమోదవడమేనా నాడు-నేడు..? 2019లో టీడీపీ ఓటమితో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నార’ని అన్నారు.