సీఎం చంద్రబాబు ఏపీ ఆర్థిక వృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్థిక వనరుల శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇందులో ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి చేయాల్సిన అన్ని పనులపై సమీక్షించారు. ఆదాయం పెంచుకోవాలంటే పన్నలను పెంచాలంటూ కొందరు అధికారులు సూచిస్తే.. చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. గత సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఏపీకి ఇలాంటి గతి పట్టిందని.. దాన్ని ప్రజలపై మోపడం కరెక్ట్ కాదని సీఎం చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.
ప్రజలపై పన్నుల భారం పడకుండా ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని కోరారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సరే.. ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచన తమకు లేదన్నారు. పన్ను ఎగవేతలు లేకుండా చూడాలని.. అదే సమయంలో వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయొద్దంటూ ఆయన కోరారు. వాణిజ్య పన్నుల నుంచి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల ద్వారా రూ.41,420 కోట్ల ఆదాయం రాగా.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది నెలల్లోనే రూ.41,382 కోట్లు వచ్చిందని తెలిపారు అధికారులు.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో వీటి నుంచి మరింత ఆదాయం వస్తుందని చెప్పారు. దాంతో చంద్రబాబు కూడా ఆ రకమైన ఆదాయ మార్గాలను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక నుంచి ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించి ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు పెంచుదామని చెప్పారు చంద్రబాబు.